కేసీఆర్ పై ఈసీకి వీహెచ్‌పీ ఫిర్యాదు

హిందువుల విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడిన బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

ఈనెల 25వ తేదీన భువనగిరి రోడ్ షోలో కెసిఆర్ మాట్లాడుతూ అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అక్షతల పంపిణి, తీర్థప్రసాదాల వితరణ, కాషాయ జెండాలతో నిర్వహించిన శోభాయాత్రలను అవహేళన చేసే విధంగా,  అవమానపరిచే విధంగా మాట్లాడి హిందువుల విశ్వాసాలు కించపరిచారని ఆరోపించింది. 

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా హిందువుల విశ్వాసాలు కించపరుస్తున్నారని ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కాబట్టి, ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా నిషేధం విధించాలని కోరుతూ డిమాండ్ చేసింది. ఈ విషయమై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని సీఈఓ వికాస్ రాజ్ వీహెచ్‌పీ  రాష్ట్ర ప్రతినిధి బృందానికి హామి ఇచ్చారు.

 వీహెచ్‌పీ  ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు బి. నర్సింహ్మ మూర్తి, మఠమందిర్ విభాగ్ జాతీయ సంయోజకులు ఎం. రామరాజు, కార్యదర్శి ఎస్. పండరీనాధ్,  ఉపాధ్యక్షులు జగదీశ్వర్, రాష్ట్ర సహా కార్యదర్శి డా|| రావినూతల శశిధర్, నగర కార్యదర్శి వీరేశలింగంలు ఉన్నారు.