రూ 2.29 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రాష్ర్ట బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ అసెంబ్లీలో ఇవాళ ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఏపీ బ‌డ్జెట్‌లో సంక్షేమ పథ‌కాల‌తో పాటు మ‌హిళల అభివృద్ధికి పెద్ద‌పీట వేశారు.

బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ ను ప్రవేశ పెడుతూ  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అని తెలిపారు.  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు కార్యాలయాలు వంటివని చెప్పారు.

1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

బడ్జెట్‌ కేటాయింపులు 

బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు
వైఎస్సార్‌ వాహన మిత్ర: రూ.285 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ: రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు

రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు
లా నేస్తం: రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా: రూ.6,337 కోట్లు
అమ్మఒడి: రూ.6,107 కోట్లు
వైఎస్సార్‌ చేయూత: రూ.4,455 కోట్లు
రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు