నామినేషన్లకు గడువు ముగింపు… పోటీలో అభ్యర్థులు ఖరారు

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 46 మంది నామినేషన్లు వేయగా, నగరిలో అత్యల్పంగా 6 అభ్యర్థులు పోటీలో నిలిచారు. 

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో 13 మంది పోటీలో ఉన్నారు. మంగళగిరిలో 40, పులివెందులలో 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లను ఈసీ ఆమోదించింది.  ఒకే కుటుంబం నుంచి దాఖలైన స్వతంత్ర అభ్యర్థుల నామినేష‌న్లను ఈసీ ఆమోదించలేదు. నంద్యాల పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 36 నామినేషన్లు, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ తెలిపింది.

కాగా, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 625 నామినేషన్లను ఈసీ  ఆమోదించింది. అయితే వీరిలో 100 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 525 మంది తుది పోటీలో నిలిచారు. సికింద్రాబాద్‌  లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌ స్థానం నుంచి అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

కరీంనగర్ లో 28, పెద్దపల్లిలో 42, నిజామాబాద్‌లో 29, మెదక్ లో 44, జహీరాబాద్‌లో 19, మల్కాజిగిరిలో 22, హైదరాబాద్‌లో 30, చేవెళ్లలో 43 మంది పోటీలో నిలిచారు. నాగర్ కర్నూల్ లో 19, మహబూబ్‌నగర్‌లో 31, నల్గొండలో 22, భువనగిరిలో 39, వరంగల్‌లో 42, మహబూబాబాద్‌లో 23, ఖమ్మంలో 35 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

జనసేనకు కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన ఈసీ.. ఇంతలో మరో షాక్ ఇచ్చింది. జనసేన పోటీలో లేని చోట గ్లాస్ గుర్తును ఇతర అభ్యర్థులకు కేటాయిస్తోంది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల గీతకు ఎన్నికల అధికారులు గాజు గ్లాసు సింబల్ కేటాయించడంతో కూటమి నేతల్లో ఆందోళన చెందుతున్నారు.