మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు

 
* టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి మేనిఫెస్టో
 
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ఎన్డీయే కూటమి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. ఇందులో భారీ హామీలు ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ మినీ మ్యానిఫెస్టో రూపంలో ఇచ్చిన గ్యారంటీలతో పాటు జనసేన, బీజేపీ ప్రతిపాదించిన పలు హామీలకూ ఇందులో చోటు కల్పించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఇలా అన్ని రంగాల వారినీ సంతృప్తి పర్చేలా ఇందులో పలు హామీలున్నాయి.
 
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఉమ్మడిగా దీనిని విడుదల చేశారు.

కూటమి మ్యానిఫెస్టోలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటింఛారు. 
 
ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని, ప్రతీ ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్ ఇస్తామని, ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున అందిస్తామని,  మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రతీ ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొంది. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని కూటమి నేతలు తెలిపారు. అలాగే మత్సకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. బోట్ల మరమ్మత్తులకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ కు నిధుల కేటాయింపు, చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలిస్తామని వెల్లడించారు. 
 
ఎయిడెడ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరిస్తామని మరో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేస్తామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని,  ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ లకు రూ.10 లక్షల రాయితీ కల్పిస్తామని, చేనేత పరిశ్రమలో పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని, ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని వివరించారు.

 
ఎన్డీయే తెచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను రాష్టంలో అమలు చేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. రాజధానిగా అమరావతి కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్, బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. బీసీల స్వయం ఉపాధి కోసం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతామని, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తామని, అలాగే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు తెలిపారు.

గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య, జెల్లయ్య యాదవ్, అమర్నాథ్ గౌడ్ కేసుల్ని రీఓపెన్ చేస్తామని, ఎవర్నీ వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. అలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.2 వేల గౌరవ వేతనం ఇస్తామని,  స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ఎల్లడించారు. 
 
ఉద్యోగస్తుల ఆత్మ గౌరవం పెంచేలా నిర్ణయాలుంటాయని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి నెలా జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని, సీపీఎస్ విధానం ఎలా చేస్తే బాగుంటుందో చేస్తామని,  కాపు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని, దామాషా పద్ధతిన కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు పొందిన వారికి ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. 
 
ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తో పాటు ఇతర కార్యక్రమాలు అమలుకు హామీ ఇచ్చారు. మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు అమలు చేస్తామని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా, పోలవరం సహా ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. డ్రైవర్లకు 15 వెలు ఏటా ఆర్థిక సాయం, చంద్రన్న భీమా మళ్ళీ అమలు, ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్, ప్రతి మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ల ఏర్పాటు చేస్తామని, అలాగే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు నియంత్రిస్తామని వివరించారు.