బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు

బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక విపక్షాలు ‘నకిలీ’ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రతిపక్షాలకు ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఈశాన్యం నుంచి దక్షిణం వరకు ప్రతిపక్షాలు ఎన్ని గందరగోళాలు వ్యాప్తి చేసినా, బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 

దేశవ్యాప్తంగా బీజేపీ వేవ్ ఉందని అభిప్రాయపడ్డారు. అసోంలోని గువాహటిలో ఈటీవీ భారత్ ప్రతినిధి అనామిత రత్నతో అమిత్ షా ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“ఈ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఘోర పరాభవం తప్పదు. ఆ విషయం వారికి తెలుసు. అందుకే ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేయడం వంటి చౌకబారు వ్యూహాలకు పాల్పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని ఎన్​డీఏ సర్కార్ తీవ్రంగా కృషి చేసిందని, దాని ఫలితంగానే అసోం ప్రజలు నేడు వీధుల్లో తిరగగలుగుతున్నారు” కేంద్ర హోంమంత్రి తెలిపారు.

“తమిళనాడుకు చెందిన ఎవరో నా మార్ఫింగ్ వీడియోను షేర్ చేశారని నాకు చెప్పారు. నా ఒరిజినల్ వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది, అందులో నేను ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేయడం గురించి మాట్లాడాను కాyeనీ వారు (వీడియోను మార్ఫింగ్ చేసిన వారు) ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు  వ్యతిరేకంగా చేశారు” అని తెలిపారు. అయితే, భారతీయ జనతా పార్టీ ఎస్సి, ఎస్టీ, ఒబిసిల రిజర్వేషన్‌లకు మద్దతు ఇస్తుంది కాబట్టి అందుకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న ప్రతిపక్షాల ఆరోపణపై ఈ విషయాన్ని రాహుల్ గాంధీని అడగాలని అమిత్ షా సూచించారు. “ఈ దేశ ప్రజలు గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రూపొందించే అధికారాన్ని మాకు అందించారు. మేము ఈ సంపూర్ణ మెజారిటీని ఆర్టికల్ 370 రద్దు చేయడానికి, రామమందిరాన్ని నిర్మించడానికి, ట్రిపుల్ తలాక్‌ను అంతం చేయడానికి ఉపయోగించాము, కానీ రిజర్వేషన్లపై ఎప్పుడూ దాడి చేయలేదు” అని గుర్తు చేశారు.

మొదటి, రెండో దశలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా విపక్షాలపై మరోసారి చురకలంటించారు. ప్రతిపక్షపార్టీల మద్దతుదారులు ఇప్పటికే నిరాశలో కూరుకపోయారని, వారు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడ్డారని ఎద్దేవా చేశారు. 

బీజేపీ మద్దతు ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి పోలింగ్ బూత్​కు వస్తున్నారని చెప్పారు. అయితే మిగిలిన ఐదు దశల్లో అందరూ బయటకు వచ్చి ఓటువేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరింది.