ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్‌ వేయడమా?

ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్‌ వేయడమా?
సందేశ్‌ఖాలీ కేసులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వైఖరిని సోమవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఓ పిటిషన్‌దారుగా ఇక్కడికి రావాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. సందేశ్‌ఖాళీలో కొందరు మహిళలపై నేరాలకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారంటూ వచ్చిన పిర్యాదులపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ ఈ నెల పదో తేదీన కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సం దీప్‌ మెహతాల ధర్మాసనం ఈవిషయంలో ప్రభుత్వం పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి సమాధానం ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలుండటంతో పిటిషన్‌ వేయాల్సి వచ్చిందని చెప్పారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే వాటిని తొలగించాలని హైకోర్టునే ఆశ్రయించి ఉంటే సరిపోయేది కదా? అని ప్రశ్నించింది. తొలుత సింఘ్వి వాదనలు ప్రారంభిస్తూ ఈ పిటిషన్‌ను 2 వారాల తర్వాత విచారణకు చేపట్టాలని కోరారు. ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలపై ప్రభుత్వం సవాలు చేయాలనుకుంటోందని చెప్పారు.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కల్పించుకొని కేసు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఇతరత్రా వినియోగించుకోకుండా ఆదేశించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు అమలుకాలేదని ఒకవేళ అవతలి పక్షం వారు కోర్టు ధిక్కరణ పిటిషన్‌వేస్ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని హైకోర్టుకు చెప్పమని సింఘ్వికి సూచించింది. 

దీనిపై ఆయన జవాబు ఇస్తూ తాను 2వారాల తర్వాత విచారణ చేపట్టాలని కోరుతున్నానని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ‘‘భూ ఆక్రమణలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపైనే దర్యాప్తు జరపాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది కదా’’ అని గుర్తు చేసింది. ఇందుకు సింఘ్వి జవాబిస్తూ దీనిపైనే చెప్పాల్సింది చాలా ఉందని తెలిపారు.

ధర్మాసనం జవాబిస్తూ ‘‘మీ కోరిక మేరకే కేసును వాయిదా వేస్తు న్నాం. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్న కారణం చూపి హైకోర్టులో కేసు విచారణను సాగదీయకూడదు’’అని స్పష్టం చేసింది.

టీచర్ల భర్తీ స్కాంపై సీబీఐ విచారణ నిలుపుదల

కాగా, ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ స్కాంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. స్కూల్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా నియమితులైన 25,753 టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రం స్టే విధించడానికి నిరాకరించింది. 
 
తదుపరి విచారణను మే 6న చేపట్టనున్నట్లు తెలిపింది.  25వేల మంది ఉద్యోగుల నియామకాలను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు? అన్నదాన్ని విడదీసి చూడలేమా? అక్రమాల ద్వారా లబ్ధిపొందిన వారెవరో గుర్తించలేమా? అని ప్రశ్నించింది. 
 
కుంభకోణంలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలను కూడా రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.