రఘురామ అరెస్ట్, కస్టడీ హింసపై సిబిఐ విచారణ 

తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్‌ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో), సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌ విజయ పాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

2004-09 మధ్యకాలంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ‘క్విడ్‌ ప్రొ కొ’ పద్ధతిలో అవినీతికి పాల్పడినందున 11 కేసుల్లో సీబీఐ జగన్‌ను నిందితుడిగా చేర్చింది. ఆయనపై మనీలాండరింగ్‌ కేసులు కూడా ఉన్నాయి. 16 నెలలు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం జగన్‌ తన సహనిందితులకు ఉన్నత స్థానాలు కల్పించి సాక్షులను దారికి తెచ్చుకోవడానికి భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

దాంతో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నా తండ్రి రఘురామరాజు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి రోజూ ఫోన్లు, సామాజిక మీడియా ద్వారా ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ చెప్పినట్లు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌ నడుచుకుంటున్నారని భరత్‌ తన పిటిషన్‌లో తెలిపారు. సీఐడీ అదనపు ఎస్పీ,  తన తండ్రి కేసు దర్యాప్తు అధికారి విజయపాల్‌ కూడా సునీల్ కుమార్ చెప్పుచేతలలో నడుస్తున్నారని తెలిపారు.

నిరుడు డిసెంబరు 29న విజయనగరం జిల్లా రామతీర్థంలో వెయ్యేళ్లనాటి శ్రీరామచంద్రుడి విగ్రహం తలనరికేశారు. దీనిపై హిందూ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో ఈ సంఘటనపై సునీల్‌కుమార్‌ నేతృత్వంలో జగన్‌ సీఐడీ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు.

వీరిద్దరూ ఒకే మతానికి చెందినవారు. దీనిపై రఘురామరాజు ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. అలాగే సునీల్‌కుమార్‌ ఏసుక్రీస్తును, బ్రిటిష్‌ పాలకులను పొగడుతూ చేసిన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.  సునీల్‌కుమార్‌కు, ఆయన భార్యకు వైవాహిక జీవితంలో సమస్యలున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఓ టీవీ చానల్‌ ఆయన భార్యను ఇంటర్వ్యూ కూడా చేసిందని చెప్పారు.

సునీల్‌కుమార్‌ ఒత్తిడి తెచ్చి ఆ ఇంటర్వ్యూను ఆ చానల్‌ వెబ్‌సైట్‌ నుంచి తీసివేయించారు. అయితే రఘురామరాజు ప్రోద్బలంతోనే ఆ చానల్‌ ఈ కార్యక్రమం ప్రసారం చేసిందని ఆయన భావించారు. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు రఘురామరాజుపై కేసు నమోదుచేయించి, వెంటనే  40 మంది పోలీసులను గుంటూరు నుంచి హైదరాబాద్‌ పంపించి,  మధ్యాహ్నం 3.30కి అరెస్టు చేయించారని తెలిపారు.

పైగా, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ గైనకాలజిస్టు. ఇది అప్పుడు తమ న్యాయవాదులకు, గౌరవ హైకోర్టుకు తెలియదు. పైగా ఆమె భర్త వైసీపీ లీగల్‌ సెల్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.