పులుసు గోపిరెడ్డి ఇకలేరు

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన వారు పులుసు గోపిరెడ్డి (86) మనకు ఇక అందుబాటులోలేరు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇంటికి, అందు లోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా , అన్ని విషయాలలో అప్ టు డేట్ గా ఉన్నారు. వీలైతే కూర్చొని,అది సాధ్యంకాకపోతే పడుకొని అన్ని విషయాలూ మాట్లాడేవారు.

వాకాడు (విద్యానగర్), వికారాబాద్ లోనూ లెక్చరర్ గా పనిచేశారు. విజయవాడలో శారదా జూనియర్ కాలేజి, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత మూడు సంవత్సరాలపాటు చత్తీస్ గఢ్ వెళ్లి వనవాసుల సేవలో కొత్త కోణాలను ఆవిష్కరించి వచ్చారు.

రాష్ట్రీయ స్వయం సేవక సంఘమేగాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా వారి మార్గదర్శనం పొందింది. సమాలోచన అనే మేధావుల వేదికను విజయవాడలో ఏర్పాటు చేసి, చిరకాలం అధ్యక్షులుగా ఉండి ఎందరో పెద్దలను విజయవాడకు పిలిపించి ఉపన్యాసా లిప్పించారు. దేశంలో జాతీయ స్థాయిలో ఈ విధమైన వేదికల ఏర్పాటులో బహుశా ఇదే మొదటిది చెప్పవచ్చు.

జాగృతి పత్రికలో దశాబ్దాల పాటు `మనలోమాట’ అనే శీర్షికను నిర్వహించారు. పలు పత్రికలలో వందలాది వ్యాసాలు వ్రాసారు.  రాణాప్రతాప్, ఎదిగిన మనిషి(నవల), తరంమారింది (కథల సంపుటి), వికసిత సంఘ కుసుమం (మా. సోమేపల్లి సోమయ్యగారి జీవిత పరిచయం) దారిచూపిన దీపకళిక (శ్రీ గురూజీ జీవిత పరిచయం), వనయోగి (బాలాసాహెబ్ దేశపాండే జీవితపరిచయం), నేతాజీ, మరువ రాని మహామహులు మొదలైన ఎన్నో గ్రంథాలు రచించారు.

విజయవాడలో, ఆ సమీప జిల్లాలో సంఘానికి, జాతీయ భావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉండిన గోపిరెడ్డి మరణం ఒక పెద్దలోటు. 1973-73లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షునిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన గృహమే పోరాట కార్యకర్తలకు బసగా ఉంటూ ఉండెడిది.  ఎందరో సామజిక కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించారు. నిష్కర్షగా తన అభిప్రాయాలు వ్యక్తం చేతుండేవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.