ఏపీలో గృహ విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రకటించింది. గృహ వినియోగదారులు వాడే కరెంటుపై కనీస చార్జీలు లేవంటూనే కిలోవాట్‌కు నెలకు రూ.పది అదనంగా వసూలు చేయడానికి మండలి అనుమతించడంతో రాష్ట్రంలో గృహ వినియోగదారులకు చార్జీలు పెరగనున్నాయి. 

సగటు యూనిట్‌ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి కొత్త టారిఫ్‌ వివరాలను మండలి  ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏటా సమగ్ర టారిఫ్‌ ఆర్డర్‌ను విడుదల చేసేది. ఈసారి అలా కాకుండా అందులోని ముఖ్యాంశాలను మాత్రమే బహిరంగపరిచింది. 

విద్యుత్‌ సంస్థల వినతి మేరకు ఈ విభాగంలో ఈ అదనపు వసూళ్లకు మండలి అనుమతి ఇచ్చింది. దీనివల్ల కొంత అదనంగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు తప్ప నిర్దిష్టంగా ఎంత వచ్చేదీ చెప్పలేదు. వివిధ సంఘాల సూచనల మేరకు టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నామని, ఇకపై గృహ వినియోగదారుడిపై కనీస ఛార్జీలు ఉండవని చెప్పారు. కనీస ఛార్జీల స్థానంలో కిలో వాట్‌కు రూ.10చెల్లిస్తే చాలని తెలిపారు.

ఫంక్షన్‌ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట ఛార్జీలు ఉండవని, పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చబోమని జస్టిస్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు చెప్పారు. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్‌ వర్తింపజేస్తామన్నారు. కులవృత్తులకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని, దీంతో రూ.1,657 కోట్ల భారం పడుతోందని తెలిపారు. కొత్త టారిఫ్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. 

గతంలో ప్రతి బిల్లుపై కనీస మొత్తం వసూలు చేసేవారు. ఇప్పుడు వాడకాన్ని బట్టి అదనపు వసూళ్లు ఉంటాయని, అసలు వాడకపోతే ఏమీ ఉండదని మండలి పేర్కొంది. రాష్ట్రంలో సుమారుగా 1.40 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. వీరిలో అసలు కరెంటు వాడకుండా ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు చాలా తక్కువగా ఉంటారు. 

అత్యధికులు విద్యుత్‌ వినియోగిస్తూనే ఉంటారు. వారిపై అదనపు భారం పడనుంది. ఇంట్లో వాడే విద్యుత్‌ ఉపకరణాలను బట్టి కిలోవాట్‌ వినియోగం ఉంటుందని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు గీజర్‌ ఒక గంట పనిచేస్తే రోజుకు రెండు కిలోవాట్ల విద్యుత్‌ ఖర్చవుతుందని, ఏసీ పనిచేస్తే రోజుకు ఐదు కిలోవాట్ల వాడకం ఉంటుందని పేర్కొన్నాయి. 

బల్బులు, ఫ్యాన్లు, టీవీ, ఇతర విద్యుత్‌ ఉపకరణాలపై వాడే కరెంటును లెక్కగట్టి కిలోవాట్‌ రూపంలో వినియోగం లెక్కవేస్తారు. ఒక నెలకు ఎన్ని కిలోవాట్ల విద్యుత్‌ వాడిందీ లెక్కించి దానిపై ప్రతి కిలోవాట్‌కు పది రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. దీనివల్ల పది నుంచి ఇరవై శాతం వరకూ బిల్లులు పెరిగే అవకాశముందని విద్యుత్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.