ర‌జనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2021కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.  భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఈ పురస్కారం అందిస్తున్నారు.

51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ అందుకోనున్న‌ట్టు ఆయ‌న తెలియ‌జేశారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. 1969 నుండి ఈ అవార్డుల‌ని ప్ర‌క‌టిస్తుండ‌గా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పుర‌స్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.

హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇత‌ర భాష‌ల నుండి ఎంపికయ్యారు. 2018కి గాను బిగ్‌బీ  66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందు‌కున్నారు. 

ర‌జ‌నీకాంత్ 2000లో ప‌ద్మ‌భూషణ్‌, 2016లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న విష‌యం తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఆయన సినిమా రంగానికి విశేష సేవలు అందించారు. ఆశా భోంస్లే, మోహన్ లాల్, సుభాష్ ఘాయ్, బిశ్వజిత్ ఛటర్జీ, శంకర్ మహదేవన్ సభ్యులుగా గల కమిటీ ఈ అత్యున్నత పురస్కారానికి రజనీకాంత్ ను ఎంపిక చేసిన్నట్లు మంత్రి జవదేకర్ తెలిపారు. 

ఈ పురస్కారాన్ని ప్రకటించగానే రజనీకాంత్ ను అభినందించిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. పలు తరాల అభిమానం చూరగొన్న ఆయన చాల కొద్దిమందికి సాధ్యమయ్యే విధంగా విభిన్న పాత్రలు పోషించారని ప్రధాని కొనియాడారు.

1975లో కె బాలచందర్ సినిమా `అపూర్వ రాగాంగ్’ తో నాటానను ప్రారంభించిన ఆయన మొదట్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు వేస్తుండేవారు. 1995లో బాషా సినిమాతో జాతీయ స్థాయిలో సూపర్ స్టార్ గా పేరొందారు. ఒక దశాబ్దం తర్వాత ఆయన నటించిన శివాజీ చిత్రం ఆ సమయంలో రూ 100 కోట్ల క్లబ్ లో చేరిన మూడో భారతీయ సినిమాగా ఖ్యాతి పొందింది.  గోవాలో జరిగిన 45వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయ చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన ఈ శతాబ్దంలో ప్రముఖ వ్యక్తిగా గౌరవం పొందారు.