భార‌త ప్ర‌భుత్వం, మోదీకి ర‌జ‌నీకాంత్ థ్యాంక్స్‌

ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు త‌న‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జ్యూరీకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ట్విట‌ర్ హ్యాండిల్ ద్వారా ర‌జ‌నీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌న కెరీర్ మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచిన స్నేహితుడు రాజ్ బ‌హ‌దూర్‌, త‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ రావు గైక్వాడ్‌కు కూడా ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేర‌కు ర‌జ‌నీ మొత్తం మూడు ట్వీట్లు చేశారు. 
 
త‌న‌కు అభినంద‌న‌లు చెబుతూ ప్ర‌ధాని మోదీ చేసిన ట్వీట్‌కు థ్యాంక్స్ చెప్పిన ర‌జనీ.. మ‌రో ట్వీట్‌లో త‌మిళంలో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. త‌న గురువు కే బాల‌చంద‌ర్‌ను ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్‌, స్నేహితుడు క‌మ‌ల్ హాస‌న్‌ల‌కు కూడా ర‌జ‌నీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అంతకు ముందు, ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ ఎంపికకావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. తరాలుగా చెక్కుచెదరని ఖ్యాతి, కఠోరశ్రమకు, విభిన్నపాత్రలకు, అరుదైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం రజనీకాంత్ అంటూ ట్వీట్ చేశారు. తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల‌  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

న‌టుడిగా ద‌శాబ్దాల పాటు త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక శైలిని చాటుకుంటూ, నేటికి దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రశంసించారు.

సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు తగ్గ పురస్కారమని ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. కర్ణాటకలో జన్మించిన మహారాష్ట్రీయన్, తమిళ సూపర్ స్టార్ శివాజీ రావు గైక్వాడ్ అంటూ వ్యాఖ్యానించారు. వెండితెరపై తనదైన ప్రత్యేకమైన స్టైల్‌తో, మేనరిజమ్‌తో అలరించారని తెలిపారు.