వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత

యూనివర్సిటీల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ 2016 జనవరిలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  పీహెచ్‌డీ స్కాలర్   విద్యార్థి వేముల రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేముల రోహిత్ దళితుడు కాదని, అతడి అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు. 

ఎనిమిదేళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా.. దానికి ఎవరూ కారణం కాదని పోలీసులు తేల్చాడు. రోహిత్‌ ఎస్సీ కాదని.. అతడు, అతడి కుటుంబసభ్యులు బీసీ-ఏ (వడ్డెర) కులానికి చెందినవారని.. వారు అక్రమ మార్గంలో ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని.. జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ తేల్చినట్లు అందులో వెల్లడించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ, ఏబీవీపీ నేతలకు, హెచ్‌సీయూ నాటి వీసీ అప్పారావుకు అతడి ఆత్మహత్యతో సంబంధం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దీంతో.. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని అభ్యర్థిస్తూ అప్పారావు, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, పలువురు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకులు దాఖలుచేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం డిస్పోజ్‌ చేసింది. 

8 సంవత్సరాల క్రితం జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్యపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను సైతం పోలీసులు జోడించారు. అయితే.. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

వేముల రోహిత్ కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది.

దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలతో పాటు పలువురు ఏబీవీపీ నేతలు సహా ఈ కేసులో నిందితులకు పోలీసులు ఉపశమనం కల్పించినట్టయ్యింది.

యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ విద్యావిషయంగా నిర్లక్ష్యం  చేస్తుండడంతో వెనుకబడి పోతున్నామని ఆందోళనతో పాటుగా తల్లి ఏర్పాటు చేసిన తప్పుడు ఎస్సి కులధ్రువీకరణ సర్టిఫికెట్ బయటపడితే తాను అన్ని డిగ్రీలను కోల్పోవలసి వస్తుందనే వత్తిడులు ఆత్మహత్యకు దారితీస్తిన్నట్లు భావిస్తున్నారు.

కులపరమైన వివక్ష కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ జాతీయస్థాయిలో పలువురు రాజకీయ నాయకుల జోక్యంతో  పెను దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ వంటి నేతలు హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి నాటి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడికి ఆయుధంగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేశారు.

ఈ కీలక పరిణామంపై వేముల రోహిత్ సోదరుడు రాజా స్పందిస్తూ  పోలీసుల వాదన అసంబద్దమైనదని వ్యాఖ్యానించారు. తన భావాలను ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడంలేదని నైరాశ్యం వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని, 15 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని రాజా విమర్శించారు.