ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్

ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారం ముదురుతోంది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్‌ చేసిన ఆరోపణలపై తొలుత ఆమెకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన ‘ఆప్’ తాజాగా ఆమెపై గుర్రుమంటోంది. ఈ వివాదాన్ని స్వాతి మలివాల్ పొడిగిస్తూ పోతుండటం, ”హిట్ మ్యాన్” అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు, ఆప్‌కు మధ్య ‘మాటల యుద్ధం’ ముదురుతోంది.
 
మరోవంక, కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి బయటికి రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని, బీజేపీ కుట్రలో స్వాతి మాలివాల్‌ పావులా మారిందని ఢిల్లీ మంత్రి అతిషి తీవ్రమైన ఆరోపణ చేశారు. వాస్తవానికి సీఎం కేజ్రీవాల్‌ను దోషిని చేయాలని వాళ్లు కుట్ర పన్నారని, కానీ గొడవ జరిగిన సమయంలో కేజ్రీవాల్‌ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అతిషి తెలిపారు. 
 
అప్పాయింట్‌మెంట్ తీసుకోకుండానే స్వాతిమాలివాల్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారని, అప్పాయింట్‌మెంట్‌ కాపీ చూపించమని భద్రతా సిబ్బంది అడిగడంతో వారితో గొడవ దిగారని ఆమె ఆరోపించారు. పైగా కేజ్రీవాల్ పిఎ విభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్‌ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదంటూ ఆమె కొట్టిపారేశారు. పొరపాటు జరిగిందని, తగు చర్య తీసుకుంటామని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించి, స్వాతి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించిన రెండు రోజులకు ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.
 
ఈ ఆరోపణలను తీవ్రంగా కొట్టిపారవేస్తూ పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లు 20 ఏళ్ల కార్యకర్తనైన తనపై బీజేపీ ఏజెంట్‌గా ముద్ర వేశారని స్వాతి మాలివాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్‌లో నిజాన్ని అంగీకరించిన పార్టీ.. ఇవాళ యూ టర్న్‌ తీసుకుందని ఎక్స్‌ వేదికగా విమర్శించారు.
 
దీనికంతటికీ కారణం ఆ గూండానే అని విభవ్‌ కుమార్‌ను ఉద్దేశించి స్వాతి మాలివాల్‌ మండిపడ్డారు. తాను అరెస్టయితే ‘పార్టీ రహస్యాలు అన్నీ బయటపెడుతా’ అని ఆ గూండా బెదిరిస్తున్నాడని, అందుకే పార్టీ ఇవాళ మార్చిందని ఆమె ఆరోపించారు. ఆరెస్టుకు భయపడే ఆ గూండా షెల్టర్‌ కోసం లక్నో చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. 
 
ఆ గూండా ఒత్తిడితోనే పార్టీలోని నేతలంతా ఇవాళ తన క్యారెక్టర్‌ను హత్య చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయినా పర్వాలేదని తాను ఒంటరిగా పోరాటం చేస్తానని స్వాతి మాలివాల్‌ చెప్పారు. తన కోసం పోరాడుతూనే దేశంలోని మహిళలందరి తరఫున పోరాటం చేస్తానని తెలిపారు. తనను ఎంత కించపర్చదల్చుకున్నారో అంత చేయండని, సమయం వచ్చినప్పుడు నిజం అదే బయటికి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
 
కాగా, అబద్ధాలు, అహంకారం ఎవరిదో, ఎవరు విధేయులో, ఎవరు ద్రోహులో కాలమే చెబుతుందని, సత్యం వెలుగుచూడక మానదని ‘ఆప్’ నేత దిలీప్ పాండే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్వాతి మలివాల్‌‌పై మండిపడ్డారు. ”అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్…ఆయన పోరాడి గెలుస్తారు” అని ట్వీట్ చేశారు. ”స్వాతి మలివాల్ కా సచ్” అనే శీర్షికతో శుక్రవారం ఒక వీడియో సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయింది. ఇది ఒక్కసారిగా వైరల్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని వీడియోగా దీనిపై కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ అధికారిక నివాసంలో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్ వాదిస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది. 

తాను పోలీసులను ఇప్పటికే పిలిచానని, వారు వచ్చిన తర్వాతే వెళ్తానని ఆందులో ఆమె పేర్కొన్నట్టు వినిపిస్తోంది. ”మీరు నన్ను టచ్ చేస్తే మీ ఉద్యోగాలను నేను ఊడగొట్టడం ఖాయం” అని కూడా ఆ వీడియోలో ఆమె భద్రతా సిబ్బందితో అనడం వినిపిస్తోంది.

కేజ్రీవాల్ ఇంటి నుంచి వెలువడినట్లు చెబుతున్న తాజా వీడియోపై మరోసారి స్వాతి మలివాల్ మండిపడ్డారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఈ రాజకీయ ”హిట్ మ్యాన్” తనను తాను రక్షించుకునేందురకు ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు విషయం చూపించకుండా పోస్ట్‌లు, వీడియోలు విడుదల చేయడం ద్వారా తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే అసలు విషయాలను ప్రపంచం ముందుకు వస్తాయని, ఎవరు ఎంత దిగజారిపోయినా పైనుంచి దేవుడు చూస్తాడని స్వాతి మలివాల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. అయితే ఆ ”హిట్ మ్యాన్” ఎవరో ఆమె చెప్పలేదు.  కాగా, ఈ కేసు ఒక కుట్ర అని, బిభవ్‌ మంచి వ్యక్తని పంజాబ్ మంత్రులు ఇప్పటికే సీఎం వ్యక్తిగత సహాయకుడిని సమర్ధించగా, తాగాగా మరికొందరు ‘ఆప్’ నేతలు సైతం స్వాతి మలివాల్‌ ”హిట్ మ్యాన్” వ్యాఖ్యలపై స్వరం పెంచుతున్నారు.
 
కాగా, స్వాతి మాలివాల్‌పై దౌర్జన్యం అంశంపై అర్వింద్ కేజ్రీవాల్‌ మాట్లాడాలని, క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఆప్ మహిళల వ్యతిరేక పార్టీ అని ఆరోపించేందుకు ఆప్ న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి సోమనాథ్ భారతితో సహా పలువురు ఆప్ నేతలపై గల మహిళలపై దాడి ఆరోపణలను ఆమె ఉటంకించారు. తమ పార్టీ మహిళా ఎంపిపై జరిగిన దాడిపై కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నమ్మశక్యం కాకుండా ఉన్నదని, ఆమోద్యయోగ్యం కాదని నిర్మల స్పష్టం చేశారు.