ఏఐసీసీ కార్యాలయంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం విడతలవారీగా అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాలతో చర్చలు జరిపారు. నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతుండగా కాంగ్రెస్ అధికారికంగా సిద్ధరామయ్య మార్పుపై ఎటువంటి చర్చ జరగలేదని ప్రకటించడం గమనార్హం.
దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ తమ చర్చలు రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలకు మాత్రమే పరిమితమైనట్లు స్పష్టం చేశారు. నేటి చర్చలు కేవలం రాజ్యసభ ఎన్నికలు, ఎంఎల్సీ ఎన్నికల చుట్టూ మాత్రమే జరిగాయి. మీరు ఊహించినది నిజంకాదు అని వేణుగోపాల్ చెప్పారు.
తొలుత రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఉపముఖ్యమంత్రి పదవి సహా పలు ఆఫర్లను అధిష్ఠానం ప్రతిపాదించినా సీఎం సీటు వీడేందుకు సిద్దరామయ్య ససేమిరా అన్నట్లు తెలిసింది. తనకు హిందీ భాష రాదని, జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిలేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తన ఆప్తులతో చర్చించి చెబుతానని నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవి వదులుకోకూడదని ఆయన వర్గం చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో అత్యధికుల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ నాయకత్వానికి తెలుసు. అంతేకాకుండా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఏకైక ఓబిసి నాయకుడు ఆయనే.
పార్టీలో తిరుగుబాటులు, ఆధిపత్య పోరులు తలెత్తకుండా ఉండేందుకు గాను,సిద్ధరామయ్యకున్న హోదాను దృష్టిలో ఉంచుకుని, ఆయనకు తగిన గౌరవం దక్కేలా చూసుకుంటూనే, ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

More Stories
ఇండో- పసిఫిక్ ప్రాంత వ్యాప్తంగా క్వాడ్ నిఘా పెంపు
జనాభాలో అనవసర మార్పులు, అక్రమ వలసలపై అత్యున్నత కమిటీ
టీఎంసీకి 100 మంది కౌన్సిలర్ల రాజీనామా.. ఎంపీ బీజేపీకి మద్దతు