కరూర్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం

కరూర్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం
తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే విజయ్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్ని కోర్టు రద్దు చేసింది. ఈ ఉద్యోగాల నియామకం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. బాధితులకు అవసరమైతే ఆర్థిక సహాయం అందజేయవచ్చని పేర్కొంది. 
 
ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదని, అర్హత ఉన్నవారికే అది దక్కాలని పేర్కొంది. ప్రభుత్వ బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వారికి కుటుంబాలకు ఇలాగే ఉద్యోగాలు కల్పిస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబరులో టీవీకే చీఫ్ విజయ్ రాజకీయ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని, 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించడంతో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జులై 10న కరూర్  పర్యటనకు వెళ్లిన దళపతి విజయ్ బాధితులను కలుసుకుని, వారికి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 31 మందికి కారుణ్య నియమాకాలు, ఒక కుటుంబంలో అర్హులు ఎవరూ లేకపోవడంతో మహిళకు రూ.10 లక్షలు ప్రభుత్వం తరఫున ఇచ్చారు. 
 
కరూర్, ఈరోడ్, దిండిగల్, తిరుప్పూర్, సేలం జిల్లాల్లోని లబ్ధిదారులకు విద్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పోలీసు విభాగాల్లో ఉద్యోగాలను కల్పించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలలో భాగంగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు తాజాగా, అవి చెల్లవని, ఇది రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది.
 
ఇదిలా ఉండగా, ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ అవసరాన్ని నొక్కిచెబుత గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసింది. సమూహ నిర్వహణ ఏర్పాట్లు, విజయ్ రాక సమయం, పార్టీ నిర్వాహకులకు, స్థానిక అధికారులకు మధ్య సమన్వయం వంటి పలు అంశాలను సీబీఐ పరిశీలిస్తోంది. 
 
తాజాగా, మద్రాసు హైకోర్టు సైతం సీబీఐ విచారణను ప్రస్తావించింది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, సుప్రీంకోర్టు ఈ విచారణను పర్యవేక్షిస్తోందని గమనించిన న్యాయస్థానం ఈ కేసులోని యోగ్యతల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. మరోవైపు, తమిళనాడు సీఎం చర్యలను ‘ద్రోహం’గా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసే సాధారణ కుటుంబాలకు చెందిన లక్షలాది మంది యువత జీవనోపాధిపై ఈ చర్య దెబ్బ తీస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.