తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపేందుకు చర్యలు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం రైళ్లను పునరుద్దరించామని, డిమాండ్ ఉన్న ప్రతీ చోట రైళ్లను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల గత ఏడాది శ్రీవారిని దర్శించుకోలేకపోయానని ఆయన చెప్పారు. కరోనాను సమర్థవంతంగా భారత్ ఎదుర్కొందని ఆయన వివరించారు.
 
 మంత్రి పీయూష్‌ గోయల్‌ తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి టిటిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు మంత్రికి ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
 
కొవిడ్-19 కల్లోలం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం తన శక్తిమేర ప్రపంచానికి సాయం అందించిందని  పియూష్ గోయల్ కొనియాడారు. 130 కోట్ల మంది జనాభా గల భారత దేశం కరోనా కల్లోలం నుంచి అనతి కాలంలోనే కోలుకుని ప్రపంచానికి తన సత్తా ఎంటో చూపించిందని గుర్తు చేశారు. 
 
కల్లోల సమయంలో భారత్ ఏ ఒక్కరి మీదా ఆధారపడడలేదని… పైగా వైరస్‌పై పోరాటంలో భాగంగా మన దేశమే ప్రపంచ దేశాలకు సాయం చేసిందని గోయల్ పేర్కొన్నారు. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ 150 దేశాలకు కొవిడ్-19 మందులు అందించారని గోయల్ గుర్తు చేశారు.
 
కొవిడ్-19 ముప్పు ఇంకా సమసిపోలేదనీ… ప్రజలు అప్రమత్తంగా వుండి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటించాని ఆయన కోరారు. అందరికీ వ్యాక్సీన్ అందే వరకు, వ్యాధిని నివారించేంత వరకు అందరూ వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.