టిటిడికి రూ 300 కోట్ల విరాళంపై నీలినీడలు 

తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.300 కోట్లతో నిర్మించేందుకు ముంబయికి చెందిన ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్సల్టెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. అయితే, ఆ సంస్థ పూర్వాపరాలేంటి? ఆ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ముంబయిలోని హీరానందిని ఎస్టేట్‌ రోడ్‌లో ఉన్న ఆ సంస్థ డైరెక్టర్లు సంజరు కేదార్‌నాథ్‌ సింగ్‌, వందనాసింగ్‌లకు ఇందులో చెరి ఐదు వేల చొప్పున పది వేల షేర్లు ఉన్నాయి. ఒక్కో షేరు పది రూపాయల చొప్పున ఇద్దరికీ కలిపి ఉన్న షేర్ల విలువ కేవలం లక్ష రూపాయలే. దేశవ్యాప్తంగా ఐటి పార్కులు, సెజ్‌లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, హైక్లాస్‌ విల్లాలు.. ఒకటేమిటి రియల్‌ ఎస్టేట్‌లో దుమ్ము దులిపేస్తున్నామంటూ టిటిడి ముందు కలరింగ్‌ ఇచ్చుకున్నారు. 

ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ సంజరు కేదార్‌నాథ్‌ సింగ్‌. నిజంగా అంత సంపన్నుడా? అంటూ వెబ్‌సైట్‌లో చూస్తే అన్నీ కంప్యూటర్‌లో తీర్చిదిద్దిన గ్రాఫిక్సే తప్ప ఒక్కటి కూడా నిజమైన ‌ ఫొటో కనిపించలేదు. ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా వివరాలు లేవు. ఆ కంపెనీ బ్యాలెన్స్‌ షీట్ల చూస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.49,900 మాత్రమే. 

ఇదే సమయంలో సంస్థ నిర్వహణకు పెట్టిన ఖర్చు రూ.1.25 లక్షలు. ఈ లెక్కన ఆ కంపెనీకి వచ్చిన నష్టం రూ.75,100. ఆడిట్‌ రిపోర్ట్‌ కూడా దీన్ని ధ్రువీకరించింది. లక్ష రూపాయల మూలధనం, లక్ష రూపాయలలోపు ఆదాయం, రూ.26,634 నికర విలువ ఉన్న ఓ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటువంటి సంస్థకు ఆస్పత్రి నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు టిడిపి వెనకాముందు ఆలోచించకుండా ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ సంస్థకు ఏ స్థలాన్ని కేటాయించొచ్చు అన్న దానిపై టిటిడి ఇఒ జవహర్‌రెడ్డి శనివారం పరిశీలన కూడా చేశారు. 

ఎంఒయు చేసుకొనే ముందు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి టిటిడి తీసుకెళ్లిందో? లేదో? అదే దానిపై టిడిపి అధికారులుగానీ, టిటిడి చైర్మన్‌గానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కేరళలోని చోటానిక్కర భగవతి దేవస్థానానికి రూ.500 కోట్ల విరాళం ఇచ్చేందుకు కొచ్చిన్‌లోని దేవేశ్వర బోర్డును బెంగళూరుకు చెందిన గణశ్రావణ్‌ అనే భక్తుడు గత నవంబర్‌లో సంప్రదించాడు. 

ఇంత భారీ మొత్తంలో విరాళం స్వీకరించే విషయంలో తర్జనభర్జన పడిన ఆ దేవస్థానం బోర్డు, కాస్త ముందూ వెనుకా ఆలోచించింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలంటూ ఆ భక్తుడిని కోరింది. అంతేకాదు భారీ మొత్తం కావడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లింది. కేరళ హైకోర్టుకు కూడా విషయాన్ని నివేదించాలని ఆ దేవస్థానం బోర్డు అభిప్రాయపడింది. టిటిడి కూడా దీనిపై పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

“టిటిడికి దాతలు విరాళం అందిస్తామంటే తీసుకోవడానికి నేనే కాదు నా స్థానంలో ఎవరున్నా ముందుకొస్తారు. ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్సల్టెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు రూ.300 కోట్లు ఇస్తామని స్వచ్ఛందంగా ప్రకటించారు. ఆ సంస్థ ఆర్థిక స్థోమతపై ఆరా తీయాలని టిటిడి విజిలెన్స్‌ అధికారులను ఆదేశించాం” అంటూ జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేస్తున్నారు. 

ఒకవేళ వారు విరాళం ఇవ్వకపోయినా చిన్నపిల్లల ఆసుపత్రిని టిటిడియే నిర్మిస్తుంది. ఇందుకు స్థలసేకరణ, నిధులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటూ ప్రకటించారు. .