మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార  వైఎస్‌ఆర్‌సీపీ  ప్రభంజనం సృష్టించింది.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  క్లీన్‌స్వీప్‌ దిశగా  వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతోంది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని  కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. 
 
 విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లతో సహా ఎన్నికలు జరిగిన మొత్తం 11 కార్పొరేషన్ లను ఆ పార్టీ కైవసం చేసుకోంది.  రాష్ట్రంలోని మొత్తం 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 కైవసం చేసుకున్నది.  కేవలం రెండు మున్సిపాలిటీల్లో- తాడిపత్రి, మైదుకూరులలో మాత్రం  టీడీపీ విజయం సాధించింది.  
 
చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు  కార్పొరేషన్లలో అధికార పక్షం విజయం సాధించింది. అనంతపురం, ధర్మవరం  కార్పొరేషన్‌ల్లో  టీడీపీ  ఖాతా తెరవలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ తప్ప..ఈ ఎన్నికల్లో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మొత్తంగా చూస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. మేజర్ ఫలితాలన్నింటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 
విశాఖలో ఉక్కు కర్మాగారం అంశంపై జరుగుతున్న ఆందోళన గాని, విజయవాడలో అమరావతి రాజధాని మార్పుపై జరుగుతున్న వివాదం గాని ఎన్నికల ఫలితాలపై ప్రభావం  చూపలేక పోయింది. అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ఏకపక్షంగా విజయాలు సాధించింది. చాలా చోట్ల టిడిపి ఖాతా తెరువలేక పోవడమో, తెరిచినా ఒకే అంకెకు పరిమితం కావడమో జరిగింది.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కనిపించలేదని ఎద్దేవా చేశారు.  వైసీపీ పనితీరుకు ఈ తీర్పు అద్దంపడుతోందని బొత్స తెలిపారు.