అసెంబ్లీలో ప్రజాసమస్యలు గాలికొదిలేశారు 

అధికార, ప్రతిపక్ష సభ్యులు ‌ధూషించుకోవడానికే  అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా ఉందని అంటూ ఈ రోజు ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని బీజేపీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్  మాధవ్ ధ్వజమెత్తారు. 

శాసనసభ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చే లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈరోజు నాలుగు అంశాలు చర్చ జరగాల్సి ఉండగా, ఒక్కటి కూడా జరగలేదని విమర్శించారు. ప్రజలు, ఉపాధ్యాయులు సమస్యలపై కూడా మాట్లాడనివ్వలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని  సంక్షోభంలోకి‌ నెట్టిందని మాధవ్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ ఒక్క అంశం పైనా స్పష్టత లేదని చెబుతూ అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాల సంఘాల విషయంలో ప్రభుత్వం తీరు పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనేలా ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. 

కేంద్రం  ప్రవేశపెట్టిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రేజర్వేషన్లు, సంక్షేమ పధకాలను  రాష్ట్రం లో అమలు‌ చేయడం లేదని మాధవ్ దుయ్యబట్టారు. దీనిపై విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నా కనిపించడం లేదా అని వైసీపీ ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. 

రాష్ట్రంలో రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రోడ్డు మరమ్మతు పనులు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఇంటి పన్ను, చెత్తపై పన్ను, పెంపు,  రోడ్డుపై ప్రయాణానికి పన్నులు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.  

రాష్ట్రంలో ఆలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాధవ్  విమర్శించారు. ప్రభుత్వ లోపాలను నిలదీస్తే ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్‌రెడ్డి తన పని తీరు మార్చుకుని ప్రజల సమస్యలు పరిష్కారంలో దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. 

కాగా, కొన్ని బిల్లులు ఆమోదించుకోవడానికే  అసెంబ్లీ సమావేశాలు పెట్టారా అని బీజేపీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ సభ్యులు నిందించుకోవడంతోనే సరిపెట్టారని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలు రోడ్లపై వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారని చెప్పారు. రోడ్ల సమస్యలను పరిష్కరించాలని రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని  తెలిపారు. రైతులు తుపాన్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తోక్కారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరసనలు చేపడతామని చెప్పారు.