ఏపీ వైసీపీ నేతల జాగీరు కాదు 

ఏపీ వైసీపీ నేతల జాగీరు కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  నెల్లూరు జిల్లా అంటే తనకు చాలా అభిమానమని  చెబుతూ ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. 

శుక్రవారం  నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ కు స్వాగతం చెప్పేందుకు గూడూరు రహదారి పోటుపాళెం సర్కిల్ వద్దకు అభిమానులు నాయకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో ఆప్రాంతంలో సందడిగా మారింది. 

తన పర్యటనను వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకోవడంతో తీవ్ర అభ్యతరం చెప్పారు. రాష్ట్రంలో పర్యటించి, రైతులకు భరోసా కల్పించకూడదా అని  ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులను హెచ్చరించ్చారు. రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

దమ్ముంటే రైతులను పరామర్శించే తన పర్యటనను  అడ్డుకోవాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. తాను పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని చెబుతూ కొంతమంది పోలీసులు వైసీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. 

రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమయిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.  తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.