ఏపీ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం… స్పీకర్ చైర్ ముట్టడి   

ఏపీ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. టిడిపి సభ్యులు స్పీకర్‌ ఛైర్‌ను ముట్టడించడం, ప్రతిగా వైసిపి సభ్యులు పోడియం వద్దకు దూసుకురావడంతో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో ఏడుగురు టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేశారు.

గురువారం ఉదయం బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం నగదు బదిలీ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లఘు చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో టిడిపి సభ్యులు నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకుని రూ.3000 పెన్షన్‌ ఇస్తామన్నారని ఇస్తున్నారా అని ప్రశ్నించారు. 

దీనిపై వైసిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామానాయుడు వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని రామానాయడు తప్పుడు సమాచారం చెబుతున్నారని, అతనిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని స్పీకర్‌ను కోరారు. సభానేత సూచన మేరకు రామానాయుడుకు ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

సిఎం మాట్లాడుతుండగా నిమ్మల రామానాయుడుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టిడిపి సభ్యులు పోడియం ముందు నిరసన వ్యక్తం చేశారు. అతను మాట్లాడుతుండగా అపేశారని, అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. స్పీకర్‌ అంగీకరించక పోవడంతో పోడియంపైకి వెళ్లారు. స్పీకర్‌ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోడియం దిగి వెళ్లాలని హెచ్చరించారు. 

ఈ క్రమంలో టిడిపి సభ్యులు, స్పీకర్‌ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒక్కసారిగా సభ్యులంతా ఛైర్‌ మీదకు వెళ్లడంతో వైసిపి సభ్యులూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పోడియం ముందుకు చేరుకున్నారు. వారిని మంత్రి పేర్ని నాని, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వారించారు.

టిడిపి సభ్యులు పోడియంపై ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో అచ్చెన్నాయుడు, బాలవీరాంజనేయస్వామి, రామకృష్ణబాబు, బి.అశోక్‌, జోగేశ్వరరావు, రామరాజు, సత్యప్రసాదును సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్షల్స్‌ సభలోకి రావడంతో సభ్యులు బయటకు వెళ్లిపోయారు. వారితోపాటు చంద్రబాబునాయుడు, మిగిలిన సభ్యులు కూడా సభ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వాగ్వివాదం జరుగున్న సమయంలో సభలో తీవ్రస్థాయి పదజాలంతో దూషించుకున్నారు. అరే ఓరే అనేపదాలు వాడారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాసనముల రెండో సవరణ బిల్లుా2020ను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బత్స సత్యనారాయణ ప్రవేశపెట్టాగా, ప్రతిపక్షం తీవ్రంగా ఆక్షేపించింది. కరోనా కష్ట కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇటువంటి బిల్లులు ప్రజలకు భారంగా మారతాయని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. ప్రతి సంవత్సరం ఆస్తి విలువ పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ప్రతియేటా పన్నులు పెరిగే ప్రమాదముందని తెలిపారు.

 మంత్రి బత్స మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్నును  10 నుంచి 15 శాతానికి పన్నులు మించి పెరిగే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు.  ఆస్తిపన్ను విధింపుపై ప్రజలను ప్రతిపక్షం గందగోళంలోకి నెడుతోందని విమర్శించారు. 375 చదరపు అడుగులలోపు ఉన్న ఇళ్లకు రూ.50 మాత్రమే పన్ను ఉంటుందని తెలిపారు.