బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ని గెలిపించడానికి అమరావతి ప్రాంత రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా మద్దతు అందజేస్తున్నారు. అమరావతి రైతులు ఉద్యమానికి మొదటి నుండి కీలకమైన మద్దతు అందిస్తున్న ఆయనను గెలిపించుకోవడం ద్వారా రాజధానిని రక్షించుకొనే అవకాశం అమరావతి రైతులు భరోసా వ్యక్తం చేశారు. 
 
 అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నాయకులు భారీ సంఖ్యలో భవానీ పురం బీజేపీ కార్యాలయంకు చేరుకుని సుజనాకు సంఘీభావంగా మద్దతు తెలిపారు. జే ఏ సి నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతులను మోసం చేసిందని, ఆ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
రైతుల ఉద్యమానికి సుజనా ఎంతగానో సహకరించారని, ఆయన అందించిన సహకారాన్ని మరువలేమని ఆమె  చెప్పారు. జనసేన నాయకురాలు రజని మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి సుజనా చౌదరి పాత్ర కీలకమని  పేర్కొన్నారు రైతు నాయకులు కొమ్మినేని  వరలక్ష్మి, కోలు దుర్గ, స్వరాజ్య రావు, అనుమొలు గణేష్, కొమ్మినేని సత్యనారాయణ, కట్టా రాజేంద్ర, జమ్ముల శాంతి కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
సుజనా చౌదరి గారికి మద్దతుగా అమరావతి రైతులు, మహిళలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజనా ర్యాలీలో పాల్గొని అక్కడ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరించారు.
 
కాగా, సుజనా చౌదరి వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ద ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి చూపుతానని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామని పేర్కొన్నారు. 
 
ప్రధాని మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని, ప్రసూతి  ఆస్పత్రిని నిర్మిస్తామని, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్టును ఆన్ లైన్ లో పెడతామని, తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి  ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు.
 
కాగా, సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది.   మాలలు, అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. పార్టీలకు అతీతంగా మాలలు అందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
 
అణగారిన వర్గాలు. ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్నసుజనా చౌదరికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు తెలిపారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని చెప్పారు.