లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో రాజకీయంగా కలకలం రేపిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అస్లీల వీడియోల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని జేడీఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలతో కూడిన 25 వేల పెన్ డ్రైవ్‌లను కావాలనే రాష్టవ్యాప్తంగా సర్క్యులేట్ చేశారని ఆయన ఆరోపించారు.
‘సమాజంలో జరగకూడని ఒక హేయమైన సంఘటనపై నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా. ఏప్రిల్ 21న రాష్ట్ర వ్యాప్తంగా అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ను పోలీసు అధికారులు సర్క్యులేట్ చేశారు. వాటిపై బెంగళూరు రూరల్, మండ్యలో ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హాసన్ సెక్స్ రాకెట్‌పై విచారణ జరుపుతోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) కాదు సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్ టీమ్, శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. సిట్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని మొదట భావించా. సిట్ అధికారులు డీకే శివకుమార్, సిద్దరామయ్య ఏజెంట్లుగా పనిచేస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. హాసన్ సెక్స్ రాకెట్ కేసు కోసం డీకే శివకుమార్ రూ.30-40 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ ఆడియో ఉందని ఆయన తెలిపారు. తమకు సిట్‌పై నమ్మకం లేదని, అందుకే హాసన్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
హాసన్ సెక్స్ రాకెట్లో డీకే శివకుమార్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని, ఆయనను వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వం, సిట్‌పై ఉందని స్పష్టం చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నారో నాకు తెలియదు. ఎన్నికల ప్రచారంలో నేను బిజీగా ఉన్నాను. హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని కించపరిచేందుకు, నాశనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర జరుపుతోంది’ అంటూ విమర్శించారు.
`ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, పెన్ డ్రైవ్‌లో అశ్లీల వీడియోల గురించి మాకు ముందే తెలిసి ఉంటే ఆయనకు హాసన్ ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్లం కాదు. హాసన్ సెక్స్ రాకెట్‌పై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేను. అది ఆ పార్టీ ఇష్టం. దేశంలో ఇలాంటి ఘటన జరగకూడదనేది నా అభిప్రాయం.’ అని కుమారస్వామి తెలిపారు.
మరోవంక, మహిళ అపహరణ కేసులో అరెస్టై సిట్ అదుపులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ప్రజాప్రతినిధుల కోర్టు తిరస్కరించింది. హెచ్ డీ రేవణ్ణను సిట్ అధికారులు మహిళ కిడ్నాప్ కేసులో మే 4న అరెస్ట్ చేశారు. ఆయనను విచారణ కోసం నాలుగు రోజులపాటు మే 8వరకు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఊరట లభించలేదు.
ప్రజ్వల్‌పై జారీచేసిన బ్లూకార్నర్ నోటీసులకు ఇంటర్‌పోల్ స్పందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, సిట్ ముందు హాజరయ్యేందుకు ప్రజ్వల్ అడిగిన ఏడు రోజుల సమయం మంగళవారంతో ముగిసింది. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు