హర్యానా లో మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు

లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానాలో నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ  ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ముగ్గురు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు.  తాము లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్‌ సంగ్వాన్‌, రణ్‌ధీర్‌ గొల్లెన్‌, ధరమ్‌పాల్‌ గొండెర్‌ ప్రకటించారు. 
 
ఈ మేరకు వారు రోహ్‌తక్‌లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హూడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ సర్కార్‌ విఫలమైందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు తీవ్రమయ్యాయని వీరు ఆరోపించారు. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. 10 సీట్లు గెలిచిన జన్‌నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ), ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఒక హర్యానా లోకిత్‌ పార్టీ ఎమ్మెల్యే మద్దతుతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఎన్నికల సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో బీజేపీతో జేజేపీ తెగదెంపులు చేసుకుంది.

ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సైతం బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. అయితే, 10 మంది జేజేపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీజేపీకి మద్దతు తెలిపారు. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం కొనసాగాలంటే ప్రభుత్వానికి 45 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక హర్యానా లోకిత్‌ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి ఉంది.

అయితే, బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు నాయబ్‌ సింగ్‌ సైనీకి లేదని హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌ తెలిపారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

అయితే, తన ప్రభుత్వంకు ముప్పు లేనట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంకేతం ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆకాంక్షలు నెరవేరుస్తుందని భావిస్తున్నా, ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయని నయాబ్ సింగ్ సైనీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

‘కానీ ప్రజలకు అందరికి తెలుసు. తమ ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. కానీ, వారి వ్యక్తిగత ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తారు’ అని చెప్పారు. కొత్తగా తనకు తలెత్తిన ముప్పును ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహాన్ని ఆయన బయట పెట్టలేదు.