జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ

జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పక్షం టీఆర్ఎస్ కు ధీటుగా బిజెపి ఘన విజయాలు సాధించింది. అధికార పక్షాన్ని మట్టి కరిపించి, దాదాపు సమానంగా ఓట్లు పొంది, రెండో స్థానం పొందింది. రెండో స్థానంలో ఉన్న ఎంఎంను మూడో స్థానంకు నెట్టివేసింది. 
 
గత ఎన్నికలలో 4 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు 49 సీట్లను గెల్చుకొంది. 99 సీట్లను గెల్చుకున్న టీఆర్ఎస్ 56కు పడిపోయేటట్లు చేసింది. దాదాపు అన్ని డివిజన్ లలో గెలుపొందిన టీఆర్ఎస్, ఎంఐఎం లకు సమీప ప్రత్యర్థిగా బిజెపి నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ యెరుగనంతగా ఓటర్లు బిజెపిని ఆదరించారు.
 
30 మందికి పైగా ఎల్యేల్యేలు, ఎమ్యెల్సీ, ఎంపీలను ఎక్స్ ఆఫీసియో ఓటర్లుగా ఓట్ వేసినా సొంతంగా మేయర్ పదవి పొందలేని దుస్థితికి అధికార పక్షం చేరుకొంది. దానితో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మొదటి నుండి చెబుతున్నట్లు మేయర్ పదవిని ఎంఐఎంతో పంచుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
కాంగ్రెస్ ఎమ్యెల్యేలుగా గెలువపొంది టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నేతల నియోజకవర్గాలలో, ఇటీవల వరద ముంపుకు గురైన ప్రాంతాలలో బిజెపి అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. మొదటి సారిగా ఎంఐఎంకు కంచుకోటగా ఉంటూ వస్తున్న పాత బస్తీలో బిజెపి పాగా వేసింది. దాదాపు అన్ని డివిజన్ లలో ఎంఐఎం కు సమీప ప్రత్యర్థిగా బిజెపి నిలిచింది. గతంలో టీఆర్ఎస్ ఆ స్థానంలో ఉండెడిది. 
 
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి మూడు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ 11 డివిజన్ లలో గెలుపొందింది. గత ఎన్నికలలో 44 స్థానాలు గెల్చుకున్న ఎంఐఎం ఇప్పుడు 43 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. అయితే పలు సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. 
 
టీఆర్ఎస్  కు ఖచ్చితమైన ప్రత్యామ్న్యాయంగా ప్రజలు బిజెపిని గుర్తిస్తున్నట్లు ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎల్ బి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని మొత్తం 11 డివిజన్ లలో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. పైగా ఎంఐఎంకు పోటా పోటీగా బిజెపి పలు డివిజన్ లలో ఓట్లు పొందింది. 
 
  టీఆర్ఎస్ అవినీతి, అక్రమ, కుటుంభం పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపామని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బిజెపికి గురుతర బాధ్యత అప్పజెప్పారని సంజయ్ చెప్పారు. దుబ్బాకలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావును ప్రజలు దెబ్బ కొడితే, గ్రేటర్ హైదరాబాద్ లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు షాక్ ఇచ్చారని పేర్కొన్నారు.
 
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలలో తమ పార్టీ కంచుకోట అయినప్పటికీ బిజెపి అభ్యర్థి గెలుపొందడంతో ఖంగారు పడిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మూడు నెలలు ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిపినప్పటికీ పరాభవం తప్పలేదు. 
 
బిజెపి కార్యకర్తల వీరోచిత పోరాటమే ఈ ఫలితాలు అని బండి సంజయ్ కుమార్ చెప్పారు. దుబ్బాకలో బిజెపి గెలుపు తర్వాత బిజెపి ఎక్కడని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు 2023లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

బీజేపీ వల్లే కేసీఆర్‌లో భయం మొదలైందని బిజెపి నిజామాబాదు ఎంపీ డి అరవింద్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్లలో కేటీఆర్‌ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెబుతూ తెలంగాణలో బీజేపీ అవినీతి రహిత పాలన అందించగలదని భరోసా ఇచ్చారు.

సెక్రటేరియట్‌కు ఏడేళ్లుగా పోని కేసీఆర్ రాష్ట్రంలో రైతులను, మైనార్టీలను, మహిళలను, దళితులను మోసం చేశారని అర్వింద్ ఆరోపించారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 15 లోక్‌సభ సీట్లు గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.