గాంధీ, ఉస్మానియాలలో పెద్ద ఆపరేషన్లు బంద్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రతిష్టాకరమైన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులుగా పేరొందిన హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ప్రస్తుతం మొక్కుబడిగా మాత్రమే పనిచేస్తున్నాయి. నిత్యం వేలాదిమంది పేద ప్రజలు వైద్య సేవలు పొందుతూ ఉండే ఈ ఆసుపత్రులు ఇప్పుడు నామమాత్రపు వైద్య సేవలకు పరిమితం అవుతున్నాయి. 
 
దేశంలోనే పురాతన  భుత్వ ఆసుపత్రులలో ఒకటిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు గత జులైలో వరద నీరు వార్డ్ లలో రోగుల మంచాల కిందకు చేరుకోవడంతో ప్రధాన భవనాలను మూసి వేశారు. గాంధీని కరోనా వడియాసేవలకు ప్రత్యేకం చేశారు. దానితో ఈ రెండు ఆసుపత్రులలో గత కొన్ని నెలలుగా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడం లేదు.
 
కనీసం అందుకు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేదు. దానితో పేదలకు వైద్యసేవలు ఎక్కడ పొందాలో అంతుచిక్కడం లేదు. వేరే భావనాలలోకి ఉస్మానియాను మార్చినా అక్కడ ఇరుకుగా పథకాలను సర్దుబాటు చేసినా ఆపరేషన్ థియేటర్లకు ఏర్పాట్లు మాత్రం చేయలేక పోయారు. పాతవాటితో సదుకోమని వైద్యులకు సూచిస్తున్నారు. 
 
అవసరాల మేరకు ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయాలనీ జూనియర్ వైద్యులు ఆందోళనలు జరుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొద్దిపాటి ఆపరేషన్లు చేస్తున్నా ప్రధానమైన ఆపరేషన్లు చేయలేక పోతున్నారు. కొన్ని సర్జరీ విభాగాలు అసలు పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గాంధీ  ఆసుపత్రిలో ఈ మధ్యనే కరోనేతర వైద్య సేవలను ప్రారంభించినా పూర్తి స్థాయిలో ఆపరేషన్లు మాత్రం చేయడం లేదు. పలు వైద్య సేవలు ఈ రెండు ఆసుపత్రులలో తప్ప సమీపంలో మరే ప్రభుత్వ ఆసుపత్రిలో లభించక పోవడం గమనార్హం. ఇక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడం సామాన్య ప్రజలకు అసాధ్యమైన విషయం. 
 
ఆరోగ్యశ్రీ పధకం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న చార్జీలు గిట్టుబాటు కావడం లేదని అంటూ ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యసేవలకు నిరాకరిస్తున్నారు. తమ వద్దే వైద్యసేవలు కావలి అంటే అదనంగా లక్షల రూపాయిలు చెల్లించమని స్పష్టం చేస్తూ ఉండడంతో, అటువైపు చూడలేక పోతున్నారు.