నదిలో దిగి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి మృతి

అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శి అనికేత్‌ ఓవల్‌ దురదృష్టవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లో ఈత కొడుతున్నప్పుడు మునిగి చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.  
 
ఏబీవీపీ  జాతీయ కార్యదర్శి అనికేత్‌ ఓవల్ నదిలో మునిగిపోయిన విషయాన్ని ఏబీవీపీ సాయంత్రానికి ధ్రువీకరించింది. మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లోని ధాడ్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఒక నదిలో మిత్రులతో కలిసి ఈతకు వెళ్లి సుడిగుండంలో చిక్కకుని మునిగిపోయాడు. 
 
అనికేత్ నదిలో మునిగిపోయాడనే వార్త తెలియగానే కొంతమంది గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఫలితం లేకపోయింది. కొన్ని గంటల తరువాత మృతదేహాన్ని కనుగొన్నారు. మహారాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శిగా ఉన్న అనికేత్ రెండేళ్ళ క్రితం జాతీయ కార్యదర్శి అయ్యారు. 
 
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఆర్‌సీ-సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో  చురుకైన పాత్ర పోషించారు. జాతీయ కార్యదర్శి అనికేత్‌ ఓవల్ అకాల మరణంతో ఏబీవీపీ షాక్‌కు గురైంది. ఆయన మరణంతో విద్యార్థుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన ఒక విద్యార్థి నాయకుడిని కోల్పోయామని తెలిపింది.