కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల త‌ర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌లైన అనంత‌రం బీజేపీ గ్రాఫ్ మ‌రింత పెరిగింద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ మ‌ళ్లీ అదే సంతుష్టీక‌ర‌ణ, బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌ను పున‌రావృతం చేసింద‌ని చెప్పారు. దేశాన్ని విభ‌జించే ప‌ర్స‌న‌ల్ లాను ముందుకు తీసుకెళ‌తామ‌ని కాంగ్రెస్ మేనిఫెస్టో స్ప‌ష్టం చేసింద‌ని ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమిత్ షా పేర్కొన్నారు.

పేద‌ల అభ్యున్న‌తి, దేశ పురోగ‌తికి క‌ట్టుబ‌డి ఉండే పార్టీని ఆద‌రించాల‌ని తాను ఓట‌ర్ల‌ను అభ్య‌ర్ధిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. దేశాన్ని ష‌రియా ప్ర‌కారం ముందుకు తీసుకువెళ‌తారా అని రాహుల్ గాంధీని అమిత్ షా ప్ర‌శ్నించారు. మ‌న రాజ్యాంగం లౌకిక పునాదుల‌పై ఏర్ప‌డింద‌ని, మ‌త ప్రాతిప‌దిక‌న మ‌న చ‌ట్టాలు రూపొంద‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉమ్మ‌డి పౌర స్మృతి తీసుకువ‌స్తామ‌ని బీజేపీ త‌న మేనిఫెస్టోలో స్ప‌ష్టంగా పేర్కొంద‌ని గుర్తుచేశారు. తాము ట్రిపుల్ త‌లాక్‌ను ర‌ద్దు చేసి యూసీసీని చేప‌ట్టామ‌ని, దీన్ని తాము ముందుకు తీసుకెళతామ‌ని షా తేల్చిచెప్పారు. దేశాన్ని విభ‌జించే ప‌ర్స‌న‌ల్ లా గురించి రాహుల్ మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. 

ఈ దేశంలో వ్య‌క్తిగ‌త చ‌ట్టాలను అమ‌లు చేయ‌లేమ‌ని, న‌రేంద్ర మోదీ మూడోసారి దేశ ప్ర‌ధానిగా పాల‌నా ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని అమిత్ షా ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఉమ్మడి పౌర స్మృతి ప్ర‌ధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీ అని, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు దాన్ని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తుంద‌ని అమిత్ షా తెలిపారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ వ్య‌క్తిగ‌త చ‌ట్టాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ధ్వజమెత్తారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గున లోక్‌స‌భ స్థానంకు చెందిన అశోక్‌న‌గ‌ర్ జిల్లాలోని పిప్రాయి ఏరియాలో జ‌రిగిన స‌భ‌లో షా మాట్లాడారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పోటీప‌డుతున్నారు. త‌న ప్ర‌సంగంలో రాహుల్‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. ప్ర‌జ‌ల్ని మ‌భ్యపెట్టేందుకు రాహుల్ బాబా ఏదైనా చేస్తార‌ని చెప్పారు. 

కానీ వ్య‌క్తిగ‌త చ‌ట్టాల‌ను బీజేపీ ఆమోదించ‌బోద‌ని స్పష్టం చేశారు. ఇది తాను చేస్తున్న ప్రామిస్ అని, ఇది మోదీ గ్యారెంటీ అని కూడా పేర్కొన్నారు. ఉత్త‌రాఖండ్‌లో ఉమ్మ‌డి పౌర స్మృతిని అమ‌లు చేసిన‌ట్లే దేశ‌వ్యాప్తంగా యూసీసీని అమ‌లు చేయ‌నున్న‌ట్లు షా తెలిపారు. దేశంలో న‌క్స‌లిజం, ఉగ్ర‌వాదాన్ని మోదీ స‌ర్కారు అణిచివేసింద‌ని తెలిపారు.