తలోజా జైలు నుంచి అర్నాబ్ విడుదల

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన తలోజా జైలు నుంచి గత రాత్రి విడుదలయ్యారు. జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అర్నాబ్‌‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో.. ఆయనకు ఊరట లభించింది. జైలు నుంచి విడుదల అయిన అర్నాబ్‌ కొద్ది దూరం రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు చాలామంది రావడం విశేషం. దీంతో.. కారులో నుంచే అర్నాబ్ వారికి అభివాదం చేశారు. 
 
 రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా ఆర్కిటెక్ట్- ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 
వీరిపై ఐపీసీ సెక్షన్ 304 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 34 (ఒకే ఉద్దేశంతో నిందితులు ఏకంకావడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. 
 
అర్నాబ్‌ను శివసేన ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేయించిందన్న వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీంతో.. అర్నాబ్ అరెస్ట్ రాజకీయానికి దారితీసింది. ఈ కేసులో అరెస్టయిన 8 రోజుల తర్వాత అర్నాబ్ బెయిల్‌పై బయటకు రావడం గమనార్హం.