నితీశే బీహార్ ముఖ్య‌మంత్రి… బిజెపి స్పష్టం   

బీహార్ త‌దుప‌రి ముఖ్య‌మంత్రి నితీశ్ కుమారే అని బీజేపీ ప్ర‌క‌టించింది. అందులో ఎలాంటి సందేహం లేద‌ని ఆ పార్టీ నేత‌, రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోదీ స్ప‌ష్టం చేశారు. తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని, ఇందులో ఎలాంటి గంద‌ర‌గోళం లేద‌ని,  నితీశే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతార‌ని చెప్పారు.
ఎన్నిక‌ల్లో కొంద‌రు ఎక్కువ సీట్లు గెలుస్తారు, మ‌రికొంద‌రు తక్కువ స్థానాల్లో విజ‌యం సాధిస్తారు. కానీ తామంతా స‌మాన భాగ‌స్వాముల‌మ‌ని వెల్ల‌డించారు. మూడు విడుత‌ల్లో జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూట‌మిలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. 
 
కూట‌మిలో ఉన్న సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 43 స్థానాలతో స‌రిపెట్టుకుంది‌. దీంతో నితీశ్ సీఎం ప‌ద‌వీ గండం ఏర్ప‌డిందని, రాష్ట్రంలో మొద‌టిసారిగా బీజేపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో సీఎం ప‌దవిపై సుశీల్ కుమార్ మోదీ స్ప‌ష్ట‌త‌నిచ్చారు.  
 
కాగా, దీపావ‌ళి త‌ర్వాత నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని రాజ్య‌స‌భ స‌భ్యులు, జేడీయూ నాయ‌కుడు కేసీ త్యాగి వెల్ల‌డించారు. నిన్న వెల్ల‌డైన ఫ‌లితాల్లో ఎన్డీయే కూట‌మి 125 స్థానాలు, మ‌హాఘ‌ట‌బంధ‌న్ 110, ఎల్జేపీ ఒక స్థానంలో, ఇత‌రులు 7 స్థానాల్లో గెలుపొందారు.
 
2000 (8 రోజులు), 2005, 2010, 2015, 2017లో మొత్తం ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నితీష్ కుమార్ శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. 
 
ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయకపోయినా ఆయన లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి ఆరు సార్లు (1989, 1991, 1996, 1998, 1999, 2004) గెలుపొందారు.