బెయిల్ పై అర్నాబ్ విడుదలకు సుప్రీం ఆదేశం 

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని, అతనితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. 
 
రూ.50,000 పూచీకత్తు కింద మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని సుప్రీం ఆదేశించింది. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన అర్నాబ్‌కు తాజా తీర్పు కొంత ఊరటనిచ్చింది.

ఈ సందర్భంగా  ఆర్నాబ్ గోస్వామి అరెస్టుపై సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా వ్యక్తిగత స్వేచ్చను హరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సర్వోన్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

‘‘ఈ కేసు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదైనందున అర్నాబ్ గోస్వామిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందా..?’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలదనీ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ (టీవీ చర్చల్లో అర్నాబ్ వ్యాఖ్యలు) పట్టించుకోవద్దని ధర్మాసనం సూచించింది.

‘‘ఆయన సిద్ధాంతం ఏదైనా కావచ్చు. నేను కనీసం ఎప్పుడూ ఆయన చానెల్ కూడా చూడలేదు. కానీ ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం జోక్యం చేసుకోకపోతే మనం నిస్సందేహంగా పతనం దిశగా పోతున్నట్టే. అసలు విషయం ఏమంటే.. మీరు ఈ ఆరోపణల కింద ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించవచ్చా అనేదే..’’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. 

తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అర్నాబ్ పెట్టుకున్న ఓ పిటిషన్‌ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇచ్చేందుకు బోంబే హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అర్నాబ్ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా ఆర్కిటెక్ట్- ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ సెక్షన్ 304 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 34 (ఒకే ఉద్దేశంతో నిందితులు ఏకంకావడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.