తయారు రంగానికి రూ 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు 

దేశీయ తయారు రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలను అందజేసేందుకు రూ.2 లక్షల కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. 

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 10 రంగాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లక్ష్యాన్ని వివరిస్తూ, 10 డిజిగ్నేటెడ్ సెక్టర్లలో మాన్యుఫ్యాక్చరింగ్‌ను పటిష్టపరుస్తామని జవదేకర్ చెప్పారు.

ఇండియన్ మాన్యుఫ్యాక్చరర్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ కోసం పిలుపునిచ్చారన్నారు. దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి కోసం విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

మన దేశంలో పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే, పోటీని ఎదుర్కొంటాయని, తద్వారా తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాయని తెలిపారు. 

ఈ పథకం క్రింద లబ్ధి పొందే రంగాలు : అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఆటోమొబైల్స్, ఆటో కాంపొనెంట్స్, ఫార్మాస్యూటికల్స్, టెలికాం, నెట్‌వర్కింగ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ), స్పెషాలిటీ స్టీల్.