కాంగ్రెస్‌కు బీహార్‌ ఎన్నికల్లో కూడా చుక్కెదురు 

వృద్ధపార్టీగా పేరొందిన కాంగ్రెస్‌కు బీహార్‌ ఎన్నికల్లో కూడా చుక్కెదురైంది. 135 ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ తిరిగి కోలుకునే ప్రయత్నం ఫలించలేదు. ఇప్పటికే నాయకత్వ లోపంతో పాటు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు దిమ్మతిరిగేటట్లు చేశాయి. 
 
పైగా కాంగ్రెస్ తో జత కట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కలలు కన్న తేజస్వి యాదవ్ కు తీవ్ర ఆశాభంగం కలిగింది. కాంగ్రెస్ తో జత కట్టే ఏ పార్టీకైనా ముప్పు తప్పదని మరోసారి రుజువైంది. గతంలో తమిళనాడులో డీఎంకే, కర్ణాటకలో జెడి(ఎస్), తెలుగు రాష్ట్రాలలో టిడిపి, ఉత్తర ప్రదేశ్ లో సమాజావాది పార్టీలకు సహితం అటువంటి అనుభవం కలగడం తెలిసిందే.  
ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమితో జత కట్టి 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకుంది. 2015తో పోలిస్తే పేలవమైన ప్రదర్శన కనబర్చింది. అప్పుడు 41 స్థానాల్లో పోటీ చేస్తే 27స్థానాలను గెలుచుకుంది. బీహార్‌లో ఎన్నికల్లో ఆర్జేడీ పుంజుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా..వామపక్షాలు సైతం కాంగ్రెస్‌ కన్నా మంచి ఫలితాలు సాధించాయి.
 
ఒక్క బీహార్‌లోనే కాదు తిరిగి అధికారం చేపట్టే అవకాశాలున్న మధ్యప్రదేశ్‌లో కూడా ఓటమి చెందింది. ప్రధాని మోదీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ నిలవలేకపోతున్నది. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 9 స్థానాల్లో గెలుపొందింది. 
 
గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌, నాగాలాండ్‌, ఒడిశా, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఈ ఫలితాలను కాంగ్రెస్‌ సైతం జీర్ణించుకోలేకపోయింది. 
 
సీట్ల సర్దుబాటు సమయంలో అలసత్వం, అభ్యర్థుల ఎంపిక, బలహీనమైన సంస్థాగత నిర్మాణం, అసమర్థమైన రాష్ట్ర నాయకత్వం, కూటమి భాగస్వామ్యులతో సమన్వయం లేకపోవడం కూడా కాంగ్రెస్‌ ఓటమి కారణమైందని ఆ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

1985లో 196 సీట్లు గెలుచుకుని బీహార్ లో  అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ 1990 జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా 71 సీట్లకు పడిపోయింది. అప్పటి నుండి హస్తానికి ప్రభ కోల్పోవడం ఆరంభమైంది. 

1989లో జనతాదళ్‌ రాకతో తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అధికార పీఠాన్ని చేక్కించుకోలేకపోయింది. 

 
ఓబిసి, ఉన్నత వర్గాల ఓట్లును కోల్పోయింది. 1995లో కేవలం 29 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. తదుపరి ఎన్నికల్లో తన ఓట్ల శాతం పడిపోతూ వచ్చింది. అయితే 2015 ఎన్నికల్లో పుంజుకున్నట్లు కనిపించడంతో…అదే నమ్మకంతో ఈ సారి ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.
 
పార్టీ జాతీయ నాయకత్వం చతికల పడటమే ప్రస్తుత దుస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో సోనియా గాంధీ ఇల్లు దాటి బైటకు రాకపోవడం, మరోనేత రాహుల్ గాంధీ తరచూ అదృశ్యం అవుతూ ఉండటం, కుటుంభ పరిధి దాటి పార్టీ పట్టు ఎక్కడ జారిపోతుందో అనే ఆందోళనతో ఉత్సాహవంతులైన నేతలకు ప్రోత్సాహం లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణంగా కనిపిస్తున్నది. 
 
వచ్చే ఏడాది మొదట్లో పశ్చిమ బెంగాల్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తన  రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ తో  జత  కట్టాలని నిర్ణయించుకున్న సిపిఎంకు ఇప్పుడు బీహార్ అనుభవంతో ఐనా కనువిప్పు కలుగుతుందా?