పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఘోర ఓటమి అనంతరం ఎన్నికల జరిగిన తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాను లోక్ భవన్‌కు వెళ్లనని, గవర్నర్‌కు రాజీనామా ఇవ్వనని తేల్చి చెప్పారు. రాజీనామా చేయమని తనపై ఎవ్వరూ వత్తిడి తేలేరని కూడా చెప్పడం ద్వారా రాజ్యాంగ సంక్షోభంకు దారితీసే వాఖ్యలు చేశారు.
బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఓడిపోలేదని. విజయం సాధించిందన్న మమతా బెనర్జీ తమ ఓట్లను చోరీ చేశారని ఆమె ఆరోపించారు. మొత్తం వ్యవస్థపై తాము పోరాటం చేశామన్న మమత ప్రధాని, హోం మంత్రి అందరూ ఇందులో భాగస్వామ్యులయ్యారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారన్న మమత కోర్టును ఆశ్రయించిన అనంతరం 32 లక్షల పేర్లను పునరుద్ధరించారని గుర్తు చేశారు.
ఈ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, తమ వంద సీట్లను బలవంతంగా లాక్కున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ ప్రజల పాలిట సీఈసీ జ్ఞానేష్ కుమార్ కూడా విలన్‌గా మారారని ఆమె ఆరోపించారు. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఈవీఎంలు 80 నుంచి 90 శాతం ఛార్జింగ్‌తో ఎలా ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే తమ వారిని అరెస్ట్ చేయటం ప్రారంభించారని, సోదాలు చేశారని ఆమె విమర్శించారు.
“బంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లను. గవర్నర్‌కు రాజీనామా ఇవ్వను. ఎందుకంటే, లెక్కింపు ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. దాదాపు 100 స్థానాల్లో ప్రజా తీర్పును దోచుకున్నారు. పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్‌ను నెమ్మదింపజేశారు” అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
“ఇకపై అధికారం లేకపోయినా పోరాటం చేస్తాం. ఇంత దారుణంగా నిర్వహించిన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది. కేంద్రం నియంత్రణలో ఈసీ పనిచేసింది” అని ఆమె ధ్వజమెత్తారు. అయితే, ఈ ఎన్నికల్లో టీఎంసీ పోటీ బీజేపీకి వ్యతిరేకంగా కాదని, ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగానేనని మమత ఆరోపించారు.
ఇకపై ఈసీపై ఎలా పోరాడాలో పార్టీలో చర్చించి, ముందుకెళ్తామని చెప్పారు. మరోవైపు, ఎన్నికల సమయంలో బంగాల్ పోలీసులు అచేతనంగా ఉండిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రబలగాలు కూడా ఈసీతో కుమ్మక్కై కౌంటింగ్ కేంద్రాల్లో తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. మహిళనైన తనతోనే అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
మహిళనైన తనతోనే అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ తదితరులు ఫోన్ చేశారని ఆమె చెప్పారు. ఇకపై తాను ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
.

More Stories
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!
బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?
రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న ఆప్ పంజాబ్ ప్రభుత్వం