ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత

ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నిర్మాత ఆర్‌.బి. చౌదరి ఇక లేరు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా, ఎంతో మంది నటీనటులను, దర్శకులను వెండితెరకు పరిచయం చేసిన ‘గాడ్ ఫాదర్’ లాంటి వ్యక్తిని కోల్పోవడం సినిమా రంగానికి కోలుకోలేని దెబ్బ. 
 
ఆయన కుమారుడు, తమిళ హీరో జీవాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ విషాద వార్తతో కన్నీరుమున్నీరవుతున్నారు.  ఆర్. బి. చౌదరి పూర్తిపేరు  రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన సినిమా పరిశ్రమకు  రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో పరిశ్రమలోకి అడుగుపెట్టి మలయాళంలో పలు సినిమాలు చేశాక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. 
 
ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100 వ సినిమాగా మకుటం తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది. కేవలం భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రాలకు ఆయన పెద్దపీట వేశారు. నిర్మాతగా ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఏ భాషలో సినిమా తీసినా ఆ నేటివిటీని పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తులు.
 
ఆర్. బి. చౌదరికి నలుగురు కుమారులు. సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా. సురేష్ తండ్రిలానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. జీవన్ తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. రమేష్ 2010లో విద్యార్థి అనే సినిమాతో హీరోగా ప్రవేశింపగా,  ఆశించిన విజయం దక్కక ప్రస్తుతం సోదరుడితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. చివరి కుమారుడు జీవా కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతోన్నాడు.

తెలుగు చిత్రసీమలో ఆర్‌.బి. చౌదరి అందించిన హిట్స్ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వెంకటేష్ నటించిన సూర్యవంశం, రాజా, సంక్రాంతి, పవన్ కళ్యాణ్ సుస్వాగతం, నాగార్జున నిన్నే ప్రేమిస్తా,  మహేష్ బాబు రాజకుమారుడు వంటి చిత్రాలు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయాయి. చిరంజీవితో గాడ్ ఫాదర్, రామ్ చరణ్‌తో రచ్చ వంటి మాస్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు.