* విజయ్ ప్రభుత్వంకు కాంగ్రెస్, వామపక్షాల మద్దతు అవకాశం!
తమిళగ వెట్రి కజగం (టీవీకే) శాసనసభ పక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 7న కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. గురువారం రోజున చెన్నై సెంట్రల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ కోసం టీవీకే పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశంలో, సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై కూలంకషంగా చర్చించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్‌కు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్‌కు విజయ్ వ్రాసిన లేఖలో 108 స్థానాలతో టీవీకే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటు అవకాశం తమకు ఇవ్వాలని, 15 రోజులలో అసెంబ్లీ వేదికగా తమ బలం నిరూపించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులను విజయ్ మంగళవారం ఉదయం టీవీకే కార్యాలయంలో విజయ్ కలిశారు.
తమ రాజకీయ విధానంలో ఆత్మగౌరవం లేదా “ఆత్మ-సమ్మాన్” విషయంలో పార్టీ రాజీ పడదని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, ఏ రాజకీయ పార్టీ వద్దనైనా దూకుడుగా మద్దతు కోరడం గానీ, “యాచించడం” గానీ చేయబోమని టీవీకే నాయకులు అంగీకరించినట్లు సమాచారం. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ముందంజలో ఉంది. అతి పెద్ద పార్టీగా నిలిచింది.
అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కావాలి. ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. దీంతో విజయ్ ఏ పార్టీ మద్దతు తీసుకుంటారనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ (ఐదు సీట్లు), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2) కలిసి సుమారు 11 మంది ఎమ్మెల్యేల కూటమిని ఏర్పాటు చేసి, ఇది విజయ్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐయూఎంఎల్, డీఎండీకే లేదా పీఎంకేలోని కొన్ని వర్గాల వంటి పార్టీల నుంచి అదనపు మద్దతు లభిస్తే, ఆ ఆధిక్యం మరింత పెరిగి, అవసరం స్థిరత్వంగా మారవచ్చు.
ఈ పార్టీలలోని అగ్ర వర్గాల సమాచారం ప్రకారం, టీవీకే నాయకత్వంతో అనధికారిక చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు సంకీర్ణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ తెలిపారు. రాష్ట్రంలో తన పార్టీ, వామపక్ష మిత్రపక్షాలు “లౌకిక కూటమి”లోనే కొనసాగుతాయని ఆయన సూచించారు.
కాగా, విజయ్ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి (తూర్పు) అనే రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా ఉండకూడదు, అందుకే ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేసి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

More Stories
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!
బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?
రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న ఆప్ పంజాబ్ ప్రభుత్వం