బిజెపికి ఇటీవలి కాలంలో మహిళలే వెన్నంటి ఉండే నిశ్శబ్ద ఓటర్లు అయ్యారని, వారి బలంతోనే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారతీయ మహిళ జీవన ప్రమాణాల మెరుగుదలకు తమ పార్టీ పాటు పడిందని, దీనికి ప్రతిగా మహిళా ఓటర్లు దీవెనలు అందిస్తున్నారని ప్రధాని విశ్లేషించారు.
ఇది ఏ పార్టీకి దక్కని బలం అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానేతమ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ బీజేపీని అన్ని చోట్లా ఆదరించిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తాము సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని ముందుకు వెళ్లామని, దీనికి ప్రతిగా సబ్‌కా విశ్వాస్ ప్రతిఫలం లభిస్తోందని మోదీ పేర్కొన్నారు. బలహీన బడుగు వర్గాలు, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం తమ పార్టీ పాటుపడుతోందని స్పష్టం చేశారు.
అందరితో కలిసి, అందరి వికాశం కోసం పనిచేయడం, అందరి విశ్వాసం చూరగొనడమే బీహార్ ఎన్నికల విజయ రహస్యమని ప్రధాని మోదీ తెలిపారు.
‘ఇదెలా సాధ్యమైందని అంతా అడుగుతున్నారు? మంగళవారం వెలువడిన ఫలితాలే ఇందుకు సమధానం. దేశ అభివృద్ధి కోసం ఎవరైతే పాడుపడతారో వారికే దేశానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని దేశ ప్రజలు పదేపదే విస్పష్టంగా తీర్పునిస్తున్నారు’ అని ప్రధానిపేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాలపై విరుచుకుపడుతూ కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రధానిహెచ్చరించారు. కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు కుటుంబ పార్టీలు ఉన్నాయని చెబుతూ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన జాతీయ పార్టీ దురదృష్టవశాత్తూ ఓ కుటుంబం క్రింద చిక్కుకుందని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.
దేశంలో యువత, మహిళలు తదితరులందరూ నమ్ముతున్న పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. 2 సీట్లు, రెండు గదుల నుంచి మొదలుపెట్టిన బీజేపీ ప్రస్థానం నేడు కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చోటు దక్కించుకునే వరకు సాగిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
దేశ ఎన్నికల ప్రక్రియ ప్రజలందరూ గర్వించేలా ఉందని చెప్పారు. బీహార్‌లో ఎక్కడా రీపోలింగ్ లేకపోవడం, ప్రశాంతంగా ఓటింగ్ జరగడం ప్రత్యేకతలని పేర్కొన్నారు. గతంలో బూత్ క్యాప్చరింగ్ వంటి వార్తలు పదేపదే మనం చూసేవాళ్లమని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి అంశం మాత్రమే ఎన్నికల చర్చనీయాంశమని ప్రజలు చాలా స్పష్టంగా తీర్మానించుకున్నారని తెలిపారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటమిలు ఎలా ఉన్నా ఎన్నికల ప్రక్రియ ప్రతి భారతీయుడు గర్వించేలా ఉండటం ముదావహమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా ముగియడానికి కారణామైన ఎన్నికల కమిషన్, రాష్ట్ర అధికారులతో సహా ప్రతి ఒక్కరికీ తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
బీహా ర్ అసెంబ్లీ ఎన్నికలో మహిళల పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో ఉందని, ఆత్మనిర్భర్ భారత్‌లో వారిది ప్రముఖ పాత్ర అనే విషయం దీనిని బట్టే మరోసారి నిరూపితమైందని ప్రధాని తెలిపారు.
ప్రధాని పేర్కొన్న ఆత్మనిర్భర్ భారత్‌కు జనం పట్టం కట్టారని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా తెలిపారు. లాక్‌డౌన్ దశలో దేశంలోని 130 కోట్ల మందికి ప్రధాని తమ చర్యలతో పూర్తి స్థాయి భరోసా కల్పించారని, దీనిని గుర్తించే ప్రజలు పార్టీ పట్ల తిరుగులేని ఆదరణను కనబర్చారని నడ్డా చెప్పారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు