జీహెచ్‌ఎంసీలో నీ కొడుకు బాక్స్‌ బద్దలు కొడతాం 

‘‘నిజామాబాద్‌లో నీ బిడ్డను ఓడగొట్టినం… దుబ్బాకలో నీ అల్లుడిని ఓడించినం.. రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నీ కొడుకు బాక్స్‌ బద్దలు కొడతాం’’అని  సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నాగోలులో ‘బీసీ గోస’ పేరిట జరిగిన సమావేశంకు  సంజయ్‌తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరయ్యారు.

సీఎం కేసీఆర్‌కు బీసీల బాధలు పట్టవని, అందుకే దుబ్బాక ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. ‘‘బీసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని స్థితిలో బీసీ మంత్రులు ఉన్నారు. ఇంత నీచమైన, చెంచాగళ్ల బతుకు ఎందుకు?’’ అని ప్రశ్నించారు. 

‘‘2బీహెచ్‌కే’’ అంటే.. బేటా, బాప్‌, హరీశ్‌, కవిత అని.. అన్ని పదవులు వారే అనుభవిస్తున్నారని విమర్శించారు. హిందువులైనందుకే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచడంలేదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయడం లేదని, కానీ  ముస్లింలకు మాత్రం 12 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ప్రేమ ఉంటే బీసీని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిని చేయాలని సవాల్‌ విసిరారు. బీసీ కులవృత్తులను దెబ్బతీసేలా ముస్లింలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటే కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టారని, అదే తీరులో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. సామాజిక న్యాయమంటే ఏమిటో చూపించిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. రూ.5వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు అంటూ సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. బీసీల వాటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. 

బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని, కానీ బీసీ కోటాలోని ముస్లింలకు మాత్రం విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న మజ్లిస్‌-టీఆర్‌ఎస్‌ను గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

తల్లోజు ఆచారి మాట్లాడుతూ దుబ్బాక ఎన్నిక సందర్భంగా బండి సంజయ్‌పై దాడి జరిగితే బీసీ సంఘాలు ఖండించకపోవడం 

సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంతకుముందు బీజేపీ నాయకులందరూ నాగోలు నుంచి ర్యాలీగా బయలుదేరి సభకు హాజరయ్యారు.

కాగా, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా హుస్సేన్‌ నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్‌ పెంపుపై సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.