దుబ్బాక ఉత్సాహంతో తిరుపతిపై బిజెపి దృష్టి 

దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్థి విజయం రెండు తెలుగు రాష్ట్రాలలోని బిజెపి నేతలకు ఉత్సాహం కలిగిస్తున్నది. తెలంగాణ ప్రజలు  టీఆర్‌ఎస్‌ పాలనతో విసుగు చెంది, ఇప్పుడు తమ వైపు చూస్తున్నారనే సంకేతంతో ఇక రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి బిజెపి నాయకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికలలో పట్టు కోసం కసరత్తు ప్రారంభించారు. 
 
ఇదే జోష్ తో ఆంధ్రప్రదేశ్ లో సహితం బీజేపీ నేతలు తమ సత్తా చాటాలని ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై దృష్టి సారించి, గెలుపు సాధించడం ద్వారా ఏపీ రాజకీయాలలో తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి, ఒక్క సీట్ కూడా గెలుపొందలేక పోవడం, నోటా కన్నా తక్కువ ఓట్లు రావడం తెలిసిందే. 
 
1998లో తిరుపతి లోక్ సభ స్థానంను బీజేపీ గెలుపొందిన చరిత్ర ఉండడంతో మరోసారి అక్కడ పాగా వేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో బలమైన సంకేతాలు పంపేందుకు సిద్దపడుతున్నారు. మూడు నెలల ముందు నుండే అక్కడ ఎన్నికల ప్రచార సన్నాహాలను ప్రారంభిస్తున్నారు. 
 
ఇప్పటికే ఒక సారి పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర  ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్  తిరుపతి వెళ్లి పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపుకోసం సిద్ధపడాలని చెప్పి వచ్చారు. తాజాగా, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలసి ఆయన నేడు తిరుపతి పర్యటనకు మరోసారి వెడుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు తాను తిరుపతిలోనే మకాం ఉంటానని కూడా దేవధర్ ప్రకటించారు కూడా. 
 
తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలపార్టీ నేతలతో సమావేశం జరిపి ఎన్నికల వ్యూహంపై ప్రాధమికంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలను సమాయత్త పరచి ఎన్నికల ప్రచారానికి అవసరమైన పూర్వరంగం ఏర్పర్చుకొనే ప్రయత్నాలు ప్రారంభింపనున్నారు. 
 
పైగా, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతూ ఉన్నట్లు, మత మార్పిడిలకు  లభిస్తున్నట్లు బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రసిద్ధి చేసిందిన తిరుమలలోని శ్రీవారి దేవాలయం పవిత్రతకు భంగం కలిగిస్తున్నట్లు ఆందోళన చెందుతున్నారు. 
 
అందుకనే రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక ధోరణులను ఎండగట్టడం కోసం తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్టాకరం కాగలదని భావిస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిరక్షణ పేరుతొ వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత కూడా బిజెపితో పాటు సంఘ్ పరివార్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిపిన నేపధ్యం కూడా ఉంది. 
 
ఈ పూర్వరంగంలో బిజెపితో పాటు ఆర్ ఎస్ ఎస్ పరివార సంస్థలు అన్ని కూడా తిరుపతి ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.