కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకుని రాష్ట్ర ప్రజల్ని ఐదేళ్లుగా మోసం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు. ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్(జగనన్న గోరుముద్ద), పీఎం స్వానిధి(జగనన్న తోడు), పీఎం ఆవాస్ యోజన(జగనన్న కాలనీ), వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ(ఆయుష్మాన్ భారత్).. ఇలా చెబుతూ పోతే జగన్ పేరుతో అందిస్తోన్న సంక్షేమ పథకాల్లో కేంద్రానివే ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
విజయవాడలో గురువారం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్న జగన్ రెడ్డి ఆ యువత(వై)కు ఉద్యోగాలివ్వకుండా.. శ్రామిక(ఎస్) వర్గాలకు పనిలేకుండా.. రైతు(ఆర్)లను అన్నివిధాలా మోసం చేశారని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్ కోసం ఎన్నిసార్లు అడిగినా భూమి ఇవ్వకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందున గడిచిన ఐదేళ్లు రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని తెలిపారు. ఏపీ అన్నివిధాలా వెనుకబడిందని, ఇసుక, ల్యాండ్, మైన్, లిక్కర్ మాఫియాకు అడ్డాగా మారిందని చెప్పారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేసినా.. పేదలకు నిర్మించి ఇవ్వలేదని, నిధులిచ్చినా పోలవరాన్ని పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్డీయే ప్రభంజనంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, డబులింజన్ సర్కార్‌తో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని తెలిపారు. ఎన్డీయే ఏపీలో మొత్తం 25 లోక్ సభ సీట్లను గెల్చుకొంటుందని, దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలుస్తుందని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చామని, ప్యాకేజీ ఇతరత్రా మార్గాల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సినంత ఇచ్చామని స్పష్టం చేశారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం మోదీ, బాబు, పవన్ కూటమిగా ఏర్పడ్డారని, వచ్చే ఐదేళ్లు ప్రగతి పథమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం తమకు అనుకూలంగా పలుమార్లు మార్చుకుందని, తాము మార్చాలనుకుంటే ఇప్పుడైనా మెజారిటీ ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ముందుకెళతామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తప్ప మతం ఆధారంగా పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
పవన్ కళ్యాణ్ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్