ప్రాణహాని ఉందని జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఎ. రవిశంకర్ అయ్యన్నార్ ను గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సీపీని జేడీ కోరారు.

లక్ష్మీనారాయణ జై భారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడి నుండి కూటమి తరుఫున బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, వైసీపీ తరుఫున కేకే రాజు పోటీ చేస్తున్నారు. 

తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాలి జనార్ధన్ రెడ్డి, కేకే రాజు పేర్లు ప్రస్తావించడం కలకలం రేపుతోంది.  కాగా ఈ విషయాన్ని పోలీసులకే కాకుండా ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లవొచ్చునని తెలుస్తోంది.

లక్ష్మినారాయణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  పోలీసులకు ఫిర్యాదు చేసిన వచ్చిన అనంతరం మాట్లాడిన లక్ష్మినారాయణ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.  దేశాన్ని కుదిపేసిన కేసులను సీబీఐలో పనిచేసిన సమయంలో చూశానన్న లక్ష్మీనారాయణ ఆ సమయంలో చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. 2018 తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.అయితే పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్‌కు శిక్షపడేలా చేశానని తన మీద కక్ష కట్టారని లక్ష్మినారాయణ తెలిపారు.

” ఇక్కడ ఆ వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడ్డారు. నాకు వచ్చిన సమాచారం ద్వారా సీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఒకసారి మీటింగ్‌లో మా గురువు గారిని చాలా కష్టబెట్టారు, ఎలా అయినా అంతుచూస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ఈ కుట్ర పన్నారు. సీపీ స్పందించి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు” అని తెలిపారు. 

“సాధారణంగా నేను సెక్యూరిటీ కోరుకోలేదు. నేను ప్రజల మనిషిని. ఇప్పుడు కూడా బెదిరింపులపై ఫిర్యాదు చేసే వాణ్ని కాదు. అయితే మా కుటుంబ సభ్యులు భయపడుతూ ఉండటం వలనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బెదిరిస్తూ పోస్టులు వచ్చాయి. తేలికగా వదిలేసే విషయం కాదనిపించి ఫిర్యాదు చేశాను. నాకు ఏదైనా జరగరాని నష్టం జరిగితే దానికి తప్పకుండా బాధ్యులు వాళ్లే” అని లక్ష్మినారాయణ ఆరోపించారు.

గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. లక్ష్మీనారాయణ పార్టీకి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్‌ సింబల్‌గా టార్చిలైట్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.