ఇవిఎంలలో పడిన వోట్లను వివిప్యాట్ స్లిప్‌లతో పూర్తిగా సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ఇవిఎం విధానంలోని ఏదైనా అంశంపై ‘గుడ్డిగా అపనమ్మకం పెట్టుకోవడం’ అవాంఛిత విమర్శకు దారి తీస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
‘ప్రజాస్వామ్యం అన్ని వ్యవస్థల మధ్య సామరస్యాన్ని, నమ్మకాన్ని నిర్మించేందుకు కృషి చేయడం గురించే’ అని పేర్కొంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం రెండు ఏకీకృత తీర్పులు వెలువరించింది. ఎన్నికల్లో తిరిగి బ్యాలట్ పత్రాల విధానాన్ని అనుసరించాలని కోరుతున్న పిటిషన్లతో సహా ఈ వ్యవహారంలో అన్ని అర్జీలను బెంచ్ కొట్టివేసింది.
సిఇసి రాజీవ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాన్ని మార్చి 16న ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో ప్రకటిస్తూ, ‘ఇవిఎంలను సవాల్ చేస్తున్న పిటిషన్లను దాదాపు 40 సార్లు రాజ్యాంగ న్యాయస్థానాలు& సుప్రీం కోర్టు, హైకోర్టులు తిరస్కరించాయి’ అని తెలియజేశారు.
ఈసీ ప్రచురణ ఒకదానిని ఆయన ఉటంకిస్తూ, ఇవిఎంల ఉపయోగించిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఎన్ని సార్లు ఓడిపోయాయో అది సూచిస్తోందని తెలిపారు. ‘ఇవిఎంల కారణంగానే రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. చిన్న పార్టీలు అనేకం బ్యాలట్ పత్రాల శకంలో ఉనికిలోకి వచ్చి ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు.
ఇవిఎంలు నిష్పక్షపాతమైనవని, రాజకీయ పార్టీలు ‘అంతరాంతరాల్లో’ ఆ విషయం గుర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.‘వాటిని ‘నూరు శాతం భద్రమైనవి, నూరు శాతం నమ్మకమైనవి’ అని కూడా రాజీవ్ కుమార్ అభివర్ణించారు.
సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందన
కాగా, ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తుతుందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీవీప్యాట్ల వినియోగంపై కాంగ్రెస్ తన రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు. ఈవీఎం- వీవీప్యాట్ వెరిఫికేషన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జైరాం రమేశ్ ఎక్స్లో ఈమేరకు పోస్ట్ చేశారు.
ఈవీఎంలపై మా పోరాటం ఆగదు
ఈవీఎంలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ముగిసిపోదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఇది దీర్ఘకాలిక పోరాటమని చెబుతూ ఈవీఎంలపై సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును అందరూ అంగీకరించినా పోలింగ్ మెషీన్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆగబోదని తెలిపారు. వీవీప్యాట్, ఈవీఎంలపై మున్ముందు సుదీర్ఘ పోరాటం సాగుతుందని పేర్కొన్నారు.
ప్రపంచంలోని పలు దేశాలు ఈవీఎంలను విశ్వసించడం లేదని, వాటిని ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించడాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని అఖిలేష్ చెప్పారు. ఈవీఎంల వాడకాన్ని రాజ్యాంగ విరుద్ధమని జర్మనీ సహా పలు దేశాలు వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు. జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంల వాడకాన్ని నిషేధించాయని చెప్పారు. విపక్ష ఇండియా కూటమి, ఎస్పీలకు పట్టం కడితే కేంద్రంలో ఏర్పాటయ్యే తమ ప్రభుత్వం ఈవీఎంల వాడకాన్ని నిలిపివేస్తుందని అఖిలేష్ హామీ ఇచ్చారు.
More Stories
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం