ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెట్టలేనన్న జన సేనాని

ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో గొడవలు పెట్టాలనుకోవట్లేదని, ముద్రగడను, ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఆయనకు కుమార్తె ఉందన్న సంగతే తెలియదని పేర్కొన్నారు.

కాగా , తుని బహిరంగ సభ సమయంలో ముద్రగడ కుమార్తె, క్రాంతి, అల్లుడు పవన్ తో భేటి అయ్యారు. పార్టీ లో చేర్చుకోవలసిందిగా కోరగా  ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు ముద్రగడ పద్మనాభంతో వ్యక్తిగత వైరం లేదని, ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టలేనని తేల్చి చెప్పారు. నాన్న గారి అనుమతి పొందిన తర్వాత పార్టీలో చేర్చు కుంటానని క్రాంతికి పవన్ చెప్పారు. క్రాంతి కి ఒక సోదరుడుగా ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను జనసేన నుంచి పోటీ చేయిస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని, ఇది ఉగ్రవాద సర్కారు అని పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరులో హెలిప్యాడ్‌ తవ్వేసిన విషయం ఎవరూ చూడకపోయి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగేదో ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. దుర్మార్గాలకు తెగించిన వైసీపీని ఇంటికి పంపించాలని పిలుపిచ్చారు. 

ఆదివారం పొన్నూరు, కాకినాడ జిల్లా తునిల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘నేను వస్తున్నానని హెలిప్యాడ్‌ తవ్వేశారు. అది ఉగ్రవాద చర్య! ఆ చర్యలకు పాల్పడిన మీపైన ఉగ్రవాద కేసులు పెడతాం’ అని వైసీపీ నేతలను హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వం మారుతుందని.. వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని.. అయితే ఎన్ని సీట్ల ఆధిక్యం, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని చెప్పారు.

 ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే కూటమి అభ్యర్థులపై వైసీపీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అంటూ సీఎం జగన్ పాలనను ఎద్దేవా చేశారు.  వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని, మెజార్టీ కోసమే మనమంతా కలిసి పని చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు. వైసిపి అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని, భవిష్యత్‌ అంతా మనదేనని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.