అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారుల నియామకం

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు వివిధ ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఏపీ పోలీసులు ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 
పోలింగు అనంతరం రాష్ట్రంలో హింస చేలరేగిన నేపథ్యంలో కౌంటింగ్‌ నాడు, ఆ తరువాత శాంతి భద్రతల సమస్య రాకుండా చూసేందుకు పొలీస్‌ యంత్రాంగం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎస్‌పిలతో పాటు అదనంగా మరో ఎస్‌పి, అదనపు ఎస్‌పి ఇతర ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరంతా శనివారం సాయంత్రానికి విధుల్లో చేరాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డిజిపి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు మొత్తం 56 మందిని ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించారు. ఇక పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లాకు ఏకంగా 8 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.

మరోవైపు కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించాలని చూస్తే.. కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస కారణంగానే పోలీసులు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరిగాయి. అయితే మే 13వ తేదీతో పాటు.. 14వ తేదీల్లో పల్నాడు జిల్లా, మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.  పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యింది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించి మరీ వివరణ తీసుకుంది. అనంతరం ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి.. దర్యాప్తు నివేదికను డీజీపీకి అందించింది. డీజీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నివేదికను అందజేశారు. అయితే ఇలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా ఏపీ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.