పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని, అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని పేర్కొంటూ వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టారని, ఏజెన్సీని కూడా మార్చారని గుర్తు చేశారు. అస్తవ్యస్త పనులతో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రజల ప్రాజెక్టు అని.. త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని గుర్తుచేశారు. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారని, అయిప్పటికీ ఏజెన్సీని మార్చారని చంద్రబాబు మండిపడ్డారు.
ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని, రూ. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని తెలిపారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చెబుతూ ఏడు మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే, రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు చెప్పారు.
నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని భావించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదని చెబుతూ ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని చెప్పారు. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు.
అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా పిలిచేవారు. అలాగే ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష చేసేవారు. మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ సోమవారాన్ని పోలవారంగా మార్చారు.
ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.. ఆ దిశగానే ఈ ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. పోలవరం కుడి కాల్వను ఎక్కడి వరకు పొడిగించవచ్చు? అని అధికారులను ఆరా తీశారు సీఎం చంద్రబాబు. నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం