
బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్‌పాయ్‌గుడి సమీపంలో కాంచన్‌జంఘూ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా, ఎక్స్‌ప్రైస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది.
ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైలు ప్రమాదంలో గూడ్స్ రైలు లోకోపైలెట్, అతని అసిస్టెంట్‌తో పాటు కాంచనజంగా రైలు గార్డు మృతిచెందారు. పది రైళ్లను దారి మళ్లించారు. సిగ్నల్ ఓవర్‌షాట్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అంటే సిగ్నల్ వ్యవస్థలో ఒక్కసారిగా వోల్టేజ్ పెరగడంతో.. సిగ్నల్ మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డార్జిలింగ్ రైలు ప్రమాద వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు తెలిపారు.
బెంగాల్ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
“ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇదొక మానవ తప్పిందగా అనిపిస్తోంది. సిగ్నల్‌ని పట్టించుకోకపోవడం ప్రమాదానికి కారణం అని పరిస్థితిని చూస్తే అనిపిస్తోంది. ఈ ఘటనలో.. గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ మరణించారు. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయాడు,” అని రైల్వే బోర్డు ఛైర్మన్- సీఈఓ జయ వర్మ సిన్హ తెలిపారు.
ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి నష్టపరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు (ఒక్కొక్కరికి), స్వల్పంగా గాయపడిన బాధితులకు రూ.50 వేలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
More Stories
గ్యారంటీలతో అప్పుల ఊబిలో కాంగ్రెస్ పాలిత రాస్త్రాలు
హనీట్రాప్‌లో 48 మంది కర్ణాటక ఎమ్‌ఎల్‌ఎలు
ఆదిత్య ఠాక్రేపై సామూహిక అత్యాచారం ఆరోపణ