వ్యూహాత్మక ఖనిజాలు, అరుదైన లోహాల మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా భారత్-అమెరికాలు మంగళవారం చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, అలాగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన ఈ మైలురాయి లాంటి ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. హై-టెక్ ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, రక్షణ వ్యవస్థలు, ఈవీ తయారీలో ఈ వ్యూహాత్మక ఖనిజాలు, అరుదైన లోహాలు అత్యంత కీలకంగా ఉన్నాయి.
ప్రస్తుతం చైనా వీటి గ్లోబల్ ప్రాసెసింగ్ మార్కెట్లో ఏకచ్ఛాత్రాధిపత్యం చెలాయిస్తోంది. అందుకే చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, సప్లై చైన్లను వైవిధ్యపరచడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, “వ్యూహాత్మక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్), అరుదైన లోహాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సరఫరాలను సురక్షితం చేసేందుకుగాను ఈ రోజు భారత్-అమెరికా ద్వైపాక్షిక ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు చేస్తున్నాము” అని ప్రకటించారు. క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించామని ఆయన గుర్తు చేశారు.
ఈ అరుదైన వనరులను సురక్షితం చేసుకోవడం అనేది అత్యంత కీలకమైన విషయమని పెక్రోన్నారు. ఇది ద్వైపాక్షికంగా అయినా, క్వాడ్ వేదిక ద్వారా అయినా లేదా ఒకే రకమైన ఆలోచనలు గల దేశాల విస్తృత కూటమి ద్వారా అయినా సరే, వీటిని సురక్షితం చేయడం అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాదు, ఇరుదేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కేవలం మైనింగ్, ప్రాసెసింగ్లకే పరిమితం కాకుండా, రీసైక్లింగ్‌కు కూడా విస్తరిస్తామని జైశంకర్ వెల్లడించారు. వీటిపై ఇరుదేశాలు పెట్టుబడులను కూడా పెంచుతాయని స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో యూఎస్‌కు భారతదేశం ఎంతో కీలకమైన భాగస్వామి అని చెబుతూ ఈ ఒప్పందం ఇరుదేశాల బంధానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. “గడచిన కొద్ది రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్న నేను అమెరికా-భారత్ వ్యూహాత్మక కూటమి గురించి, అది అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఎంత ముఖ్యమైనదో నిరంతరం చెబుతూనే ఉన్నాను. ఈ రోజు కుదిరిన ఒప్పందమే దానికి ప్రత్యక్ష నిదర్శనం” అని తెలిపారు.

More Stories
మజ్లిస్ కనుసన్నల్లో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
మేడ్చల్ జాయీద్ ఖాన్ వద్ద యూపీ మంత్రుల సెల్‌ఫోన్ నంబర్లు!
`సనాతన ధర్మం’ ఎలుకల బోనులో చిక్కుకున్న సీఎం విజయ్