పాక్ ఐఎస్ఐ మద్దతుదారులతో మంతనాలు జరుపుతూ మేడ్చల్‌లో అరెస్టయిన జాయీద్ ఖాన్ ఆలియాస్ ఆదిలా ఖాన్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధుల మొబైల్ నంబర్లు సేకరించి ఉగ్రవాదులకు పంపినట్లుగా దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. ఈనెల 20వ తేదీన అంతర్జాలంలో యూపీ క్యాబినెట్ సభ్యుల ఫోన్ నంబర్లు వెతికి ఐఎస్‌ఐకి చేరవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
మేడ్చల్‌లోని ముబారక్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న జాయిద్ ఖాన్‌కు విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్టు గుర్తించిన మేడ్చల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జాయిద్ ఖాన్‌కు విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్టు గుర్తించిన మేడ్చల్ పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన జాయిద్ ఖాన్ నాలుగో తరగతి వరకు చదివాడు. 2021లో కోల్‌కతా వెళ్లి దుస్తుల వ్యాపారి వద్ద సహాయకుడిగా పనిచేశాడు.
మూడేళ్ల తర్వాత తిరిగి ఘజియాబాద్ చేరి రోహిత్ బ్యాగ్ హౌస్‌లో పనిచేశాడు. హైదరాబాద్‌లోని ముబారక్ రెస్టారెంట్‌లో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న ఇతడి బంధువు ఫైజాన్ సూచనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అదే రెస్టారెంట్‌లో నెలకు రూ.15 వేల జీతంతో సర్వర్‌గా చేరాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లో ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు బొమ్మ తుపాకులు ప్రదర్శిస్తూ రీల్స్ రూపొందించి పోస్ట్ చేసేవాడు.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో అసలైన తుపాకులు కోసం గూగుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికాడు. తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ తెలుసుకొని అతడిని సంప్రదించాడు. ఫిబ్రవరిలో అతడు తన వద్ద ఉన్న దేశీయ పిస్తోళ్ల ఫొటోలు పంపాడని పోలీసులు తెలిపారు. ఆయుధాల పట్ల ఇష్టంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అబిద్ జాట్, రానా హుస్సేన్‌ను ఫాలో అయ్యాడు.
ఆ ఇద్దరికి పాకిస్తాన్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు జాయిద్ ఖాన్ గ్రహించినట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగర్ షహజాద్ భట్టికి పాక్ ఐఎస్ఐ మద్దతున్నట్టు నిందితుడు తెలుసుకున్నాడు. ఏప్రిల్ 4న అబిద్ జాట్ సూచనతో ప్రయాగరాజ్‌కు చెందిన చోటా యోగి అనే వ్యక్తి లోకేషన్ వివరాలను జాయిద్ ఖాన్ వారికి షేర్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన మొబైల్ నెంబర్ కూడా వారికి పంపాడు.
ఆ ఇద్దరి ఫోన్ నెంబర్లు తీసుకొని జాయిద్ ఖాన్ మెల్లగా మంతనాలు ప్రారంభించాడు. ఇతడి కంటెంట్‌కు క్రమంగా వ్యూస్ సంఖ్య పెరగటంతో వారు చెప్పినట్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 10న అబిద్ జాట్ తన ఫొటో కింద పాకిస్తాన్ డాన్ అబిద్ జాట్ పేరుతో వెయ్యి పోస్టర్లు తయారు చేసి ఘజియాబాద్‌లో అంటించాలని ఆదేశించారు.
గోడలకు అంటించేటప్పుడు వీడియోలు తీసి తనకు పంపితే పిస్టల్ ఇస్తానని ఫోన్లో చెప్పటంతో నిందితుడు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు. తాను ఘజియాబాద్ వెళ్లినప్పుడు అంటిస్తానని అంగీకారం కుదుర్చుకున్నాడు. ఈ నెల 20న రాణా హుస్సేన్ నుంచి ఇతడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సహాయకుడి మొబైల్ నెంబర్ ఇవ్వాలని ఆదేశం వచ్చింది. దీంతో ఇంటర్నెట్లో వెతికి యూపీ కేబినెట్ సభ్యుల ఫోన్ నెంబర్లు వారికి పంపాడు.
తనకు ఆయుధం ఏర్పాటు చేయాలని రాణా హుస్సేన్‌ను అడిగితే రూ. 65 వేలు ఇస్తే పిస్టల్ ఇప్పిస్తానన్నట్లు తెలిపారు. తన వద్ద డబ్బులేదని చెప్పటంతో ఘజియాబాద్‌లో పోస్టర్లు అంటించాక పిస్టల్ తీసుకోవచ్చని ఆశ చూపారు. అబిద్ జాట్ మీమోస్, జాఠ్ 333 పేర్లతో ఉన్న వాట్సాప్ ఛానళ్లను ఇతడు ఫాలో అయ్యాడు. అనంతరం అబిద్ జాట్, రాణా హుస్సేన్‌లు నిర్వహిస్తున్న సోషల్ మీడియాలో గ్రూపుల్లో తనను చేర్చాలని కోరాడు.
ఇస్లాం కోసం పోరాడేందుకు తనకు తుపాకీ కావాలని పదేపదే కోరాడని పోలీసులు పేర్కొన్నారు. అట్నుంచి వచ్చిన ఆదేశాలతో యూపూతోపాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు సేకరించి పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేసినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధరించారు.

More Stories
`సనాతన ధర్మం’ ఎలుకల బోనులో చిక్కుకున్న సీఎం విజయ్
అంతర్రాష్ట్ర సమన్వయంతో తాగునీటికి శాశ్వత పరిష్కారం
`నేను నా కూతురిని కోల్పోయాను, మమతా పదవి కోల్పోయింది’