స్పష్టంగా దేశంలో 6 ఏళ్లలో వచ్చిన మార్పులను మీడియా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరి స్తూ బి జె పి గెలవడం ఎదో కుట్రలు పన్ని గెలిచినట్లు రాస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ వల్లి,ఎం ఐ ఎం వల్ల ఆర్ జే డి వొడి పోయింది అని రాస్తారు. కానీ దేశం లో బి జె పి మీద యువతలో పెరిగిన విశ్వాసం గురించి ఒక్క మీడియా సంపాదకీయం రాయలేదు.
ఏదైనా ఒక పరిణామానికి మనకుండే ఓపికను బట్టి ఎన్ని కారణాలైనా జాబితా వ్రాసుకోవచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి, భాజపా అభ్యర్థి రఘునందనరావు గెలుపులకు దారి తీసిన పదిఅంశాలను మీ ముందుంచా లనుకొంటున్నాను.
1. తెలంగాణ అంతటా తెరాస కుటుంబ పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. గట్టిగా నిలదీసేవారు, ఎండగట్టేవారూ ఉంటేనే అది వ్యక్తమవుతుంది. అటువంటి వారు కనబడనిచోట్ల ‘మనం ఒకరిద్దరం బయటపడి ఎదిరిస్తే మాత్రం ఏమవుతుంది?’ అనుకొని ప్రజానీకం నోరుమూసుకొని ఉండి పోతున్నారు. అసంతృప్తికి కారణమేమిటంటే, ముఖ్యమంత్రి చాలాచాలా గొప్పమాటలు చెప్తున్నారు. వాగ్దానాలు చేస్తున్నారు, ఆశలు కల్పిస్తున్నారు.
మరి ఆపనులు చేయటంలేదా, అంటే అస్సలు చేయటంలేదని అనలేము. ఎక్కడ తనకు, తనకుటుంబానికీ లాభదాయకంగా ఉంటుందో అక్కడ మాత్రమే చేస్తారు. ఇది తెలంగాణలోని 116 నియోజకవర్గాలవారిలో అసంతృప్తికలిగిస్తున్న అంశం. ఐతే దీనినిదుబ్బాక ప్రజలు చూస్తున్నంత స్పష్టంగా మిగిలిన జిల్లాలవారు చూస్తుండకపోవచ్చు.
2. దుబ్బాక గ్రామీణ నియోజకవర్గం. అక్కడ ఒక రాజకీయపార్టీగా భాజపాకు యంత్రాంగం గాని, వ్యవస్థలుగానీ లేవు. అయితే 1991నుండి లోకసభకు పోటీచేస్తూవచ్చిన భాజపా అభ్యర్థులద్వారా పార్టీ కార్య ప్రణాళికలు, పార్టీ గుర్తు ప్రజలమధ్యకుపోతూనే ఉన్నవి. అన్నిసందర్భాలలోకాకపోయినా కొన్ని సందర్భాలలోనైనా తగినంత ఆదరణ లభిస్తునే ఉన్నది.
3. 2018 ఎన్నికల్లో గెలుపొందలేకపోయినా, ఏదో ఒక విధంగా రఘునందనరావు ఈనియోజకవర్గ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తున్నాడు. అనేక టెలివిజన్ చానళ్ళలో జరిగే చర్చలలో పాల్గొంటూ ప్రభుత్వం వైపునుండి జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాడు.
యూ ట్యూబ్ ద్వారా వీటిని మళ్ళీమళ్ళీ చూసుకొనేందుకుకూడా వ్యవస్థ జరిగింది. దీనితో తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టుతూ ఉండటం ప్రజల దృష్టికి వస్తున్నది. శాసనసభ్యునిగా ఉండిన సోలిపేట రామలింగారెడ్డి కోవిడ్ తో మృతి చెందిన దరిమిలా ఉప ఎన్నిక జరగబోతున్నదని తెలియవచ్చినప్పటినుండి రఘునందనరావు గ్రామాలకు వెళ్ళి ప్రజలతో సంబంధాలను పటిష్టం చేసుకున్నారు.
4. గత సంవత్సరం లోకసభకు జరిగిన ఎన్నికల్లో పొరుగున ఉన్న కరీంనగర్, నిజామాబాద్ నియోజక వర్గాలనుండి భాజపా అభ్యర్థులు మంచి మెజారిటీ తో ఎన్నికైనారు.
ఏ విధమైన ప్రయోజనమూ లేకుండానే ఇక్కడి వారు భాజపాను ఎంచుకున్నారా… అనే ఆలోచన వీరికి కలిగింది. సహజంగానే దగ్గరలోఉన్న అక్కడి ప్రజలతో జరిగే సంభాషణల ప్రభావం వీరిపై ఉంది. తమకు దగ్గరలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి భాజపా అభ్యర్థి గెలుపుకు తామూ సహకరించాలనే అభిప్రాయం వారికీ కలిగింది.
5. భాజపా రాష్ట్ర నాయకత్వం పూనుకొని కదలినపుడు కొద్దిగానో గొప్పగానో ఫలితాలు వస్తుంటాయి. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన యాత్ర పేరుతో అప్పటి రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి తెలంగాణ అంతా పర్యటించారు.
అంతేకాక అనేక ఎన్నికలలో అనుభవం గడించిన జితేందర్ రెడ్డి, జి,వివేక్ మొదలుగాగల మాజీ ఎంపీలు, ఎం.ఎల్.ఏలు రెండు మూడు వారాలపాటు మకాంవేసి ఇంటింటికీ తిరిగి తమకు సానుకూలంగా వోటింగ్ జరిగేందుకు నడుం బిగించారు.
6. మండల కమిటీలు, శక్తికేంద్రాలు, బూత్ ఇన్చార్జ్ లు, పన్నా ప్రముఖ్ లు…ఇలా పార్టీకి వ్యవస్థ చేసుకోవాలి. రాష్ట్రనాయకత్వం దృష్టినికేంద్రీకరించి పనిచేయటంలో ఆ విషయంలోనూ దృష్టి సారించటం జరిగింది.
7. కాగా ప్రచారం ప్రారంభమవుతూనే తెరాస తెలిసీ తెలియక చేసిన పనులు భాజపాకు లాభదాయకంగా పరిణమించాయి. నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతిష్ఠ ఉన్న దివంగత శాసనసభ్యుడు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని నిర్లక్ష్యం చేసి రాజకీయానుభవం లేని సోలిపేట సుజాతమ్మను అభ్యర్థిగా ఎంపికచేశారు. ఆమె వైపునుండి తగినంత చొరవ లేకపోవటంతో ప్రచారభారమంతా నేరుగా హరీశ రావు మీద పడింది.
8. ఆర్థిక మంత్రిగారు అధికారగణాలకు ఏవిధమైన ఆదేశాలిచ్చారో ఏమోగాని, వారిచర్యలతో, అసత్యాలతో కూడిన ప్రకటనలతో అబద్ధపు కేసులు బనాయించి, భాజపా అభ్యర్థిని, వారిబంధువులను, భాజపా కార్యకర్తలనూ వేధిస్తున్నారనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది. అగ్నికి ఆజ్యంతోడైనట్లుగా తెరాసమీద వ్యతిరేకత బాగా రాజుకుంది.
9. ఆర్థికమంత్రి హరీశ్ రావు తెరాస అభ్యర్థిని గెలిపించటం ఎంతో కష్టమైన పనో సరిగా అంచనా వేసికొనలేదేమో! తనచేతిలో ఉన్న తేలిక పని అనుకొని ఉండవచ్చు. కరోనాబాధితులకు బియ్యము,పప్పు అన్నీ కేసిఆర్ గారే ఇస్తున్నారు, మోడీ ఏమీ ఇవ్వటంలేదు అని మాట్లాడారు.
అంతే గాక, భాజపా తరపున అనుభవ శూన్యులైనవారి మాటల లోనుండి ఒకటిరెండు మాటలు పట్టుకొని భాజపా ప్రదేశ్ అధ్యక్షునికి సవాలు విసరటము, రంగంలోకి రాబోతున్న మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకోవటమూ…ఇటువంటి పరిణామాలన్నీ కలిసి ఈ ఎన్నికలు సజావుగా జరగటం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టంలేదనే అభిప్రాయం బలపడజేశాయి.
10. ప్రత్యక్షంగా రంగంలో దిగి పనిచేసిన నాయకులు , కార్యకర్తలేగాక, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేర్చటంలో సోషల్ మీడియా మాధ్యమం గానూ కొందరు చురుకుగా పనిచేశారు. తెలంగాణ ప్రజానీకమంతా తమవైపు ఆశగా, ఆసక్తితో చూస్తున్నారని దుబ్బాక ప్రజలకు అర్థమైంది.
ఏనుగు కుంభస్థలంపై కొట్టి పాఠం నేర్పిన వారిగా చరిత్రలో నిలిచిపోయే సదవకాశాన్ని వదులుకోరాదన్న నిశ్చయానికివవచ్చి దేశంలో(మణిపూర్ లోకాక) ఎక్కడా లేనంత స్థాయిలో వోటింగ్ లో పాల్గొని ఘంటాపదంగా తీర్పు చెప్పేశారు. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దటంలో ప్రభాతవెలుగు వంటిపత్రికలుకూడా దారిదీపాలుగా నిలిచినవనిచెప్పవచ్చు.
ఈ విధంగా పట్టుదలతో కూడిన వాతావరణం ఈ అసాధారణ విజయానికి కారణమైందని చెప్పవలసి ఉంది. దుబ్బాక ప్రజానీకం ఈవిజయాన్ని స్వంతంచేసుకొని, తెలంగాణ ప్రజానీకం నుండేకాక యావద్భారత ప్రజానీకం నుండికూడా అభినందన లకు పాత్రులవుతున్నారు. ఇంతటి విజయానికి కేంద్రబిందువైన రఘునందనరావు గారిని కూడా అభినందించవలసి ఉందిగదా!
More Stories
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు