బిహార్‌లో ఎన్డీఏ కూటమి ఘన విజయం

బిహార్‌లో ఎన్డీఏ కూటమి ఘన విజయం
 
 బీహార్‌లో ఎన్డీఏ కూటమి  ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠతతో  జరిగిన ఓట్ల లెక్కింపులో బిహార్‌లో మెజార్టీ మార్క్ 122ను ఎన్డీఏ దాటేసింది. ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ కూటమి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివరకు విజయం ఎన్డీఏనే వరించింది. ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 
 
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలక్రిందులు చేస్తూ 243 స్థానాలున్న బిహార్‌లో అసెంబ్లీలో మ్యాజిక్‌ఫిగర్‌కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి.. స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికారం చేపట్టేందుకు 122 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా.. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) 125 సీట్లు సాధించింది.
 
ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ 110 స్థానాల్లో విజయం సాధించింది. నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ కూటమికి మహాకూటి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించారు.
 
 ఎన్డీయే కూటమిలో బిజెపి 74, జెడియు 43, విఐపి 4, హెచ్ఎఎం 4 సీట్లు గెల్చుకోగా, మహాగతబంధన్ లో 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్ 19, వామపక్షాలు 16 సీట్లు గెల్చుకున్నారు. 
 
కాగా, అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం బీహార్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. సీమాంచల్ ప్రాంతంలో 24 స్థానాలుండగా, 14 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది. 
 
మిగతా స్థానాలను తన భాగస్వామ్య పక్షాలైన ఆర్‌ఎల్‌ఎస్‌పి, బిఎస్‌పికి వదిలేసింది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కిషన్‌గంజ్ స్థానంలో ఎంఐఎం గెలుపొందడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది.   బీఎస్పీ, ఎల్జేపీ, స్వతంత్రులు ఒకొక్క సీటు తెలుపొందారు.